Bangladesh : బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం..ప్రధానిగా ముహమ్మద్ యూనస్..!
మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు ప్రతిపాదించారు.
- By Latha Suma Published Date - 02:37 PM, Tue - 6 August 24

Bangladesh: బంగ్లాదేశ్‌లో తన ప్రభుత్వం కూలిపోవడంతో షేక్ హసీనా సోమవారం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంక్షోభంతో బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ తరుణంలో నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్(muhammad yunus) నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు ప్రతిపాదించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో, విద్యార్ధుల ఉద్యమానికి కీలకంగా వ్యవహరించిన సమన్వయకర్త నహిద్ ఇస్లాం, దేశంలోని ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ పదవిని చేపట్టడానికి అంగీకరించిన యూనస్‌తో ఇప్పటికే చర్చించినట్లు ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు నిరసనకారుల ఆందోళనలతో అట్టుడికిపోయిన బంగ్లాదేశ్‌ను గాడిన పెట్టేందుకు ఆ దేశ రాష్ట్రపతి మహ్మద్ షహబుద్దీన్ రంగంలోకి దిగారు. ప్రతి పక్ష పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) చీఫ్ ఖలేదా జియాను విడుదల చేసేలా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అధికారులు ఉదయం 6 గంటలకు కర్ఫ్యూను ఎత్తివేసిన తర్వాత ఆగస్టు 6వ తేదీ వ్యాపారాలు తిరిగి తెరవాలని, సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు, ఆర్మీ చీఫ్, వాకర్ ఉజ్-జమాన్ ఈ ఎన్నికల ముందే షహబుద్దీన్‌తో సంప్రదించి కొత్త మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదే అంశంపై ఆగస్టు 6వ తేదీ సాయంత్రానికి స్పష్టత రానుంది. ప్రతి మరణానికి న్యాయం జరుగుతుందని, సైన్యంపై విశ్వాసం ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటును స్వాగతించిన అమెరికా ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా, ఆ తర్వాత దేశం నుంచి నిష్క్రమణపై యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లెర్ స్పందించారు. బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ దేశ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తోందని హామీ ఇచ్చారు. ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, ఆందోళనలను విరమించుకోవాలని కోరారు. బంగ్లాదేశ్ ప్రజలు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు.. తాత్కాలిక ప్రభుత్వ ప్రకటనను స్వాగతించారు.