Agnipath : అగ్నిపథ్ పథకం పై హరియాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పోలీసు, మైనింగ్ గార్డు, జైలు వార్డెన్ తదితర ఉద్యోగాల నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి నాయాబ్ సింగ్ సైనీ వెల్లడించారు.
- By Latha Suma Published Date - 06:25 PM, Wed - 17 July 24

Agnipath Scheme: హైరియాణా ప్రభుత్వం(Haryana Govt) అగ్నిపథ్ పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పోలీసు, మైనింగ్ గార్డు, జైలు వార్డెన్ తదితర ఉద్యోగాల నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి నాయాబ్ సింగ్ సైనీ వెల్లడించారు. అంతేకాక ..వయసు సడలింపుతో పాటు ఇతర రాయితీలు ఉంటాయన్నారు. ”కానిస్టేబుల్, మైనింగ్ గార్డు, ఫారెస్టు గార్డు, జైలు వార్డెన్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. గ్రూప్ సీ పోస్టుల్లో 5 శాతం రిజర్వేషన్‌తో పాటు గ్రూప్ సీ, డీ పోస్టుల్లో వయోపరిమితిలోనూ మినహాయింపు ఇవ్వనున్నాం. తొలి అగ్నివీర్ బ్యాచ్‌కు మాత్రం ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అదేవిధంగా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు అందించనున్నాం” అని విలేకరుల సమావేశంలో సీఎం పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు అగ్నివీర్ పథకం ద్వారా దేశ యువతకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న వేళ.. కేంద్ర హోంశాఖ సూచన మేరకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), బీఎస్‌ఎఫ్, ఆర్‌పీఎఫ్‌లలో 10 శాతం ఉద్యోగాలు మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేస్తున్నట్టు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే అగ్నివీరులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించేందుకు హరియాణా ప్రభుత్వం సిద్ధమైంది.
కాగా.. త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి జూన్ 2022లో అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రవేశ పెట్టింది. 17 నుంచి 21 సంవత్సరాల వయసున్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీర్‌లుగా విధులు నిర్వహించేందుకు అర్హులుగా పేర్కొంది. నాలుగేళ్లు ముగిసిన తర్వాత సర్వీస్ నుంచి తప్పుకొన్న అగ్నివీర్‌లకు పెన్షన్ సౌకర్యాలు ఉండవు. వారిలో 25శాతం మందిని మరో 15 ఏళ్ల పాటు రెగ్యులర్ సర్వీస్‌లో కొనసాగిస్తారు.
Read Also: Dengue : కర్ణాటకను వణికిస్తున్న డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు