Dasoju Shravan : కేటీఆర్ కారుపై దాడిని ఖండించిన దాసోజు శ్రవణ్
Dasoju Shravan : తెలంగాణ ప్రభుత్వానికి అమాయక పేద ప్రజల ఇళ్లు కూల్చడానికి ధైర్యం ఉంది కానీ.. దాని బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నాయకులు వెళ్లడం చూసి తట్టుకునే ధైర్యం లేదని దాసోజు శ్రవణ్ విమర్శించారు.
- By Latha Suma Published Date - 04:04 PM, Tue - 1 October 24
KTR car Attack incident : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని ఆ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. బుల్డోజర్ రాజ్ బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్తున్నప్పుడు ఆయన వాహనాన్ని అడ్డుకుని దాడి చేయడం తెలంగాణలో రౌడీ రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానికి అమాయక పేద ప్రజల ఇళ్లు కూల్చడానికి ధైర్యం ఉంది కానీ.. దాని బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నాయకులు వెళ్లడం చూసి తట్టుకునే ధైర్యం లేదని దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఇలాంటి హేయమైన చర్యలు మీ నిరంకుశ పోకడలకు అద్దం పడుతున్నాయని అన్నారు. వీటిని వెంటనే ఆపేయడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు.
Read Also: Mynampally : సీఎం రేవంత్ ఇంటిముందు ధర్నా చేస్తా – మైనంపల్లి
కాగా, మూసీ- హైడ్రా బాధితులకు అండగా నిలబడ్డారని ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు.. తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపైనా దాడికి తెగబడ్డారు. గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ముషీరాబాద్‌లో కేటీఆర్ కారును అడ్డుకున్నారు. ఆపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, బీఆర్‌ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ గూండాలు ఏ మాత్రం తగ్గలేదు. కొందరైతే ఏకంగా కారుపైకి ఎక్కి మరీ దురుసుగా ప్రవర్తించారు. చివరకు బీఆర్‌ఎస్ శ్రేణులు వారిని తన్ని తరిమివేశారు. అనంతరం అంబర్‌పేట గోల్నాక పరిధిలోని తులసీరామ్ నగర్ వెళ్లిన కేటీఆర్ అక్కడ మూసీ బాధితులను పరామర్శించారు.