Nepal Floods : నేపాల్-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు.. వందలాది వాహనాలు, పోలీసులు గల్లంతు
Nepal Floods : నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున తీవ్రమైన ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది.
- By Kavya Krishna Published Date - 02:51 PM, Tue - 8 July 25

Nepal Floods : నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున తీవ్రమైన ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. చైనా భూభాగంలోని టిబెట్ ప్రాంతంలో కుండపోత వర్షాల కారణంగా భోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగి, ఆ ప్రాంతాన్ని జలమయంగా మార్చింది. ఈ ఉగ్ర వరదలకు నేపాల్ రసువా జిల్లా తీవ్రంగా దెబ్బతింది. సరిహద్దుకు ఆనుకుని ఉన్న తైమూర్, మిటేరి ప్రాంతాల్లో హఠాత్తుగా నీటి ప్రవాహం పెరిగి మౌలిక సదుపాయాలను సమూలంగా నాశనం చేసింది.
ఈ వరదల ధాటికి మిటేరి వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. అంతేకాకుండా, నేపాల్-చైనా మధ్య ట్రేడింగ్‌కు కీలకమైన డ్రై పోర్టులో పార్క్ చేసిన దాదాపు 200 వాహనాలు బహిరంగంగా వరదలో కొట్టుకుపోయినట్లు రసువా జిల్లా చీఫ్ డిస్ట్రిక్ ఆఫీసర్ అర్జున్ పౌడెల్ తెలిపారు. వాహనాలే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న వ్యాపారులు, ప్రయాణికులు కూడా వరద నీటిలో కొట్టుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ఈ విపత్తులో ఇప్పటివరకు 12 మంది నేపాలీ పోలీసులు గల్లంతైనట్లు సమాచారం. వరద వచ్చిన సమయంలో వారు విధుల్లోనే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఎంతమంది గల్లంతయ్యారు? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? అన్న విషయంపై ఇంకా అధికారిక సమాచారం అందలేదు. వాతావరణం పూర్తిగా తేలికపడిన తర్వాతే సహాయక చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టే అవకాశం ఉందని నేపాల్ ప్రభుత్వం తెలిపింది.
ఈ దుర్ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 3 గంటల సమయంలో సంభవించింది. ప్రజలు నిద్రలో ఉన్న సమయంలోనే వరద ఆకస్మికంగా దూసుకొచ్చింది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. త్రిశూలి నది పరిసర ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇక భోటేకోషి నది వరదకు కారణం – టిబెట్ లో కురిసిన అతి భారీ వర్షాలే కావచ్చని వాతావరణశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరదల తీవ్రత దృష్ట్యా సరిహద్దు వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.
Bihar : బీహార్ ఎన్నికల వేడి.. అభివృద్ధి ప్రాజెక్టులతో ఎన్డీఏ ముందంజ