PM Modi : శతాబ్దాల త్యాగం, పోరాటం అమోధ్య రామమందిరం: ప్రధాని
ఈ దివ్యమైన, అద్భుతమైన బాలరాముడి ఆలయం వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో ప్రధాన ప్రేరణగా పనిచేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు.
- By Latha Suma Published Date - 01:32 PM, Sat - 11 January 25

PM Modi : అయోధ్యలో నిర్మించిన రామమందిరం మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ట్విటర్ వేదికగా ప్రధాని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలో శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. “శతాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం ద్వారా నిర్మించిన ఈ అయోధ్య రామాలయం భారత సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వమని” తెలిపారు. ఈ దివ్యమైన, అద్భుతమైన బాలరాముడి ఆలయం వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో ప్రధాన ప్రేరణగా పనిచేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు.
అయోధ్యలో బాల రాముడిని ప్రతిష్ఠించి ఏడాది పూర్తి కానుంది. ఈ మేరకు తొలి ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలి వార్షికోత్సవం సందర్భంగా అయోధ్యలో నిర్వహించే వేడుకల కోసం ఆలయ ట్రస్ట్, అయోధ్య జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక ఈ వేడుకలు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే గతేడాది జనవరి 22వ తేదీన అయోధ్య ప్రారంభోత్సవం జరగ్గా ఈసారి మాత్రం జనవరి 11వ తేదీన ప్రారంభించారు. అయితే సంప్రదాయ హిందూ క్యాలెండర్ ఆధారంగా తిథి రోజున నిర్వహిస్తున్నారు. అయోధ్యలో జరుగుతున్న మొట్టమొదటి వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 2025 హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది కూర్మద్వాదశి జనవరి 11వ తేదీన వచ్చింది.
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇక శనివారం ప్రారంభం అయిన ఉత్సవాల్లో.. మొదట బాల రాముడికి పంచామృతం, సరయూ నది నుంచి తెచ్చిన పవిత్ర జలంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత కార్యక్రమాలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. బాల రాముడి కోసం ఢిల్లీకి చెందిన డిజైనర్ల బృందం బంగారం, వెండి నూలు పోగులతో ప్రత్యేక పీతాంబరాలను తయారు చేసింది. హిందువుల పండుగలు.. ఆచార వ్యవహారాలు సంప్రదాయ హిందూ క్యాలెండర్ ఆధారంగానే జరుగుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. కూర్మ ద్వాదశి అని కూడా పిలిచే పుష్య మాసంలోని.. శుక్ల పక్ష ద్వాదశి నాడు(2024 జనవరి 22) అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే.