RCB : బెంగళూరు తొక్కిసలాట ఘటన.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ
ఈ ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో RCB యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) సహా పలువురు నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
- By Latha Suma Published Date - 03:31 PM, Mon - 9 June 25

RCB : ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘన విజయాన్ని జరుపుకుంటున్న సమయంలో బెంగళూరులోని ప్రసిద్ధ చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట విషాదకర ఘటనగా మారిన సంగతి విదితమే. జూన్ మొదటి వారంలో జరిగిన ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలు మంది తీవ్రంగా గాయపడ్డారు. అభిమానుల ఆనందాన్ని విషాదంగా మార్చిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో RCB యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) సహా పలువురు నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Read Also: Piracy Racket: రూ. 700 కోట్ల వార్షిక ఆదాయం.. పైరసీ ముఠా కేసులో సంచలన విషయాలు!
తాజాగా, తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ (RCSL) న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆర్సీబీ న్యాయవాదులు, తమను అన్యాయంగా, తప్పుడు ఆరోపణలతో ఇరికించారని వాదించారు. ఈ ఘటనకు తాము నేరుగా బాధ్యత వహించాల్సిన అవసరం లేదని, సమగ్ర విచారణ జరిపి తప్పు చేసినవారిని మాత్రమే శిక్షించాల్సిందిగా కోరుతూ, తమపై ఉన్న కేసును రద్దు చేయాలంటూ కోర్టును అభ్యర్థించారు. ఇప్పటికే DNA ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ కూడా తమపై నమోదైన కేసుకు వ్యతిరేకంగా పిటిషన్‌ను న్యాయస్థానంలో దాఖలు చేసింది. తమ సంస్థ కేవలం ఈవెంట్ నిర్వహణలో భాగస్వామిగా మాత్రమే వ్యవహరించిందని, భద్రత మరియు జనాల నియంత్రణ బాధ్యతలు సంబంధిత ప్రభుత్వ మరియు క్రీడా సంస్థలదేనని వారు పేర్కొన్నారు.
ఇక ఘటనకు కారణమైన భద్రతా లోపాలను దృష్టిలో ఉంచుకుని కేఎస్‌సీఏపై కూడా విచారణ జరిపే సూచనలు ఉన్నాయి. భారీ సంఖ్యలో అభిమానులను నియంత్రించడంలో విఫలమైన తీరుపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశం వ్యక్తమవుతోంది. ఈ కేసు ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో విచారణలో ఉంది. స్టేడియంలో జరిగిన తొక్కిసలాట వెనుక ఉన్న నిజాలను వెల్లడించేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు అవసరమని పలువురు న్యాయనిపుణులు సూచిస్తున్నారు. బాధితులకు న్యాయం జరగడం ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ఈ కేసు విచారణ అనంతరం తెలుస్తుంది. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని బాధిత కుటుంబాలు అంటుండగా, ఘటన వెనుక ఉన్న సాక్ష్యాధారాలను విశ్లేషించి, దోషులను తేల్చే బాధ్యత అధికారులు నిర్వహించాలని జనం కోరుతున్నారు.
Read Also: TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్‌పాస్ ఛార్జీల పెంపు..నేటి నుంచే అమలు