CM Chandrababu : సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
CM Chandrababu : వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారు. సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర. నాతో పాటు ఉద్యోగులంతా 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారు. వరద నీటిలో బాధితులకు అన్నిరకాల సాయం అందించే ప్రయత్నం చేశాం.
- By Latha Suma Published Date - 02:18 PM, Wed - 25 September 24

Vijayawada: విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ”పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒక్కటై పనిచేయగలిగాం. ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే.. మరోవైపు బుడమేరు నీరు పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా బురదలో దిగాను. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగాం. విరాళాల కోసం రాష్ట్రప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారు. వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారు. సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర. నాతో పాటు ఉద్యోగులంతా 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారు. వరద నీటిలో బాధితులకు అన్నిరకాల సాయం అందించే ప్రయత్నం చేశాం.
బాధితులకు రూ.602 కోట్లు విడుదల..
బుడమేరుతో పాటు ప్రకాశం బ్యారేజీకి ఈస్థాయిలో వరద ఎప్పుడూ రాలేదు. 11.90 లక్షల క్యూసెక్కుల గరిష్ఠ వరద సామర్థ్యం ఉంటే 11.47 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చింది. గత పాలకుల నిర్లక్ష్య వైఖరితో విజయవాడ వరద ముంపునకు కారణమైంది. కలెక్టర్ కార్యాలయంలోనే మకాం వేసి పరిస్థితి పర్యవేక్షించా. మొట్టమొదటిగా సింగ్ నగర్ వెళ్లి పరిస్థితి పరిశీలించి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి బోట్లు, హెలికాప్టర్లు తెప్పించాం. పెద్ద సంఖ్యలో ఆహార పొట్లాలు, నీటి బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశాం. సహాయక చర్యల్లో 780 పొక్లెయిన్లు పని చేశాయి. 75 వేల ఇళ్లను, 331 కిలోమీటర్ల మేర రహదారులను ఫైర్ ఇంజిన్లు శుభ్రపరిచాయి. మొత్తం వర్షాలు, వరదల కారణంగా 47 మంది మృతి చెందారు.
4 లక్షల మందికి ఆర్థిక సాయం అందించాం..
ఇప్పటివరకు రూ.400 కోట్ల మేర సీఎం సహాయ నిధికి డబ్బులు వచ్చాయి. చిన్నా పెద్దా అందరూ స్పందించారు. సంఘటితంగా ఉంటే ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కొంటాం. రూ.602 కోట్లు ఇప్పటివరకు బాధితులకు విడుదల చేశాం. ఇందులో రూ.400 కోట్లు దాతలు ఇచ్చినవే. మొత్తం నష్టం రూ.6,800 కోట్ల మేర జరిగింది. 16 జిల్లాలు ప్రభావితం అయ్యాయి. మొత్తం 4 లక్షల మందికి ఆర్థిక సాయం అందించాం. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కిరాణ దుకాణాలు, తోపుడు బండ్లకు సహాయం చేస్తున్నాం. నష్టపోయిన పంటలకు సాయం అందిస్తున్నాం. ఇళ్లు మునిగిన వారికి రూ.25 వేలు చొప్పున, మొదటి అంతస్తులో ఉన్న వారికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం” అని చంద్రబాబు తెలిపారు.