Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పై మరో నేరారోపణ..!
విద్యార్థుల ఉద్యమాన్ని కఠినంగా ఎదుర్కొనాలని భద్రతాదళాలకు, పార్టీ కార్యకర్తలకు ఆమె స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. బంగ్లాదేశ్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం వెల్లడించిన వివరాల ప్రకారం, హసీనా ఆదేశాలతోనే భద్రతాదళాలు చర్యలు ప్రారంభించాయని స్పష్టమైన ఆధారాలు తమకు ఉన్నాయని తెలిపారు.
- By Latha Suma Published Date - 03:46 PM, Sun - 1 June 25

Sheikh Hasina : బంగ్లాదేశ్ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టించిన మరో పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాపై తాజాగా మరో నేరాభియోగం నమోదైంది. 2024లో జరిగిన విద్యార్థుల ఉద్యమాన్ని అమానుషంగా అణిచివేయాలంటూ ఆమె నేరుగా ఆదేశాలిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని కఠినంగా ఎదుర్కొనాలని భద్రతాదళాలకు, పార్టీ కార్యకర్తలకు ఆమె స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. బంగ్లాదేశ్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం వెల్లడించిన వివరాల ప్రకారం, హసీనా ఆదేశాలతోనే భద్రతాదళాలు చర్యలు ప్రారంభించాయని స్పష్టమైన ఆధారాలు తమకు ఉన్నాయని తెలిపారు. మాకు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌లు, వీడియో ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాఖ్యాలు ఉన్నాయి. మొత్తం 81మంది ఈ ఘటనలకు ప్రత్యక్షంగా సాక్ష్యమిస్తున్నట్లు చెప్పారు అని ఆయన వివరించారు. హసీనా నేతృత్వంలో జరిగిన ఈ అణచివేత చర్యల వల్ల దాదాపు 1,500 మంది ప్రాణాలు కోల్పోగా, 25,000 మందికి పైగా గాయాలపాలయ్యారని అధికారులు వెల్లడించారు.
Read Also: CM Revanth : రేవంత్ కు ఆ పదవి అవసరమా? : హరీశ్ రావు
ఈ ఘోర ఘటనల నేపథ్యంలో, గత సంవత్సరం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. దీనికి ఫలితంగా హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాదాపు 15 ఏళ్లపాటు ఆమె బంగ్లాదేశ్‌ను ప్రధానిగా పాలించారు. అయితే అల్లర్ల అనంతరం 2024 ఆగస్టులో ఢాకాను వదలి న్యూఢిల్లీకి వచ్చిన హసీనా, అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఆమె ఇప్పుడు రాజకీయ ఆశ్రయం పొందిన స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్‌లో యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం హసీనా పై విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆమెపై 100కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని సమాచారం. ఆమె కుటుంబ సభ్యులపై కూడా పలు అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలు వచ్చాయి.
అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ హసీనాపై ఇప్పటికే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. ప్రాసిక్యూషన్ వర్గాల ప్రకారం ఒక దేశాధినేతగా ప్రజలపై జరిగిన దమనకాండకు బాధ్యత వహించాల్సింది ఆమెనే. అధికారంలో ఉన్నపుడు జరిగిన అన్ని చర్యలకు ఆమెనే ప్రధాన బాధ్యతదారిగా భావిస్తున్నాం అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, హసీనా మద్దతుదారులు మాత్రం ఇది రాజకీయ కక్షపూరిత చర్యగా అభివర్ణిస్తున్నారు. ఇది దేశ రాజకీయ వ్యవస్థలో మరింత భిన్నత కలిగించే అంశంగా మారనుంది.
Read Also: Telangana Formation Day : తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు..ప్రత్యేక అతిథులుగా జపాన్ ప్రతినిధులు