Pokhran Nuclear Tests : భారత్ తొలి అణు పరీక్షకు 50 ఏళ్లు.. ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా’ విశేషాలివీ
1974 మే 18 మన దేశ చరిత్రలో ఘనమైన రోజు.
- By Pasha Published Date - 08:35 AM, Sat - 18 May 24

Pokhran Nuclear Tests : 1974 మే 18 మన దేశ చరిత్రలో ఘనమైన రోజు. ఎందుకంటే సరిగ్గా 50 ఏళ్ల క్రితం అదే రోజున భారత్ తొలి అణు పరీక్షను నిర్వహించింది.తద్వారా అప్పటికే అణుపరీక్షలు నిర్వహించిన అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన భారత్ నిలిచింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేని భారత్ లాంటి దేశం అణు పరీక్షలు(Pokhran Nuclear Tests) నిర్వహించడం అప్పట్లో పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. ఇప్పుడు భారత్‌కు జైకొడుతున్న అమెరికా.. అప్పట్లో మన దేశంపై భారీగా ఆంక్షలు విధించింది. అయినా మన దేశం భయపడలేదు.
We’re now on WhatsApp. Click to Join
అణు పరీక్షలు ఎందుకు చేశారు ?
1962లో మన దేశంపై చైనా దురాక్రమణకు పాల్పడింది. అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని ఆక్రమించింది. 1964లో చైనా అణ్వస్త్రాన్ని కూడా పరీక్షించింది. ఈ పరిణామాలు భారత్‌ను ఆందోళనకు గురిచేశాయి. మరోవైపు పాకిస్తాన్ రూపంలోనూ మరో శత్రుదేశం భారత్‌కు ఉంది. 1965 నాటికి పాకిస్తాన్‌తోనూ మనకు రెండు యుద్ధాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో అణ్వస్త్రాల అభివృద్ధి దిశగా భారత్ అడుగులు వేసింది. 1971 డిసెంబరులో భారత్-పాక్ యుద్ధం జరుగుతున్న టైంలో మన దేశాన్ని బెదిరించడానికి అమెరికా తన విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ ఎంటర్‌ప్రైజ్‌ను బంగాళాఖాతంలోకి పంపింది. దీనికి స్పందనగా సోవియట్ యూనియన్.. అణు క్షిపణులు కలిగిన ఒక జలాంతర్గామిని బంగాళాఖాతంలో మోహరించింది. దీంతో అమెరికా యుద్ధనౌక అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయింది. ఈ పరిణామంతో అణ్వస్త్రాల అవసరాన్ని నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గుర్తించారు. అందుకే పోఖ్రాన్ 1 అణు పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Also Read :8 People Burnt Alive : కదులుతున్న బస్సులో మంటలు.. 8 మంది సజీవ దహనం
‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా’
1966లో ఇందిరా గాంధీ దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టాక అణు కార్యక్రమంలో జోరు పెరిగింది. అణు బాంబున రెడీ చేసి పరీక్షించడానికి బాబా అణు పరిశోధన కేంద్రాని(బార్క్)కి 1972 సెప్టెంబరు 7న ఇందిరా గాంధీ అనుమతి ఇచ్చారు. దీంతో శాస్త్రవేత్తలు 13 కిలో టన్నుల అణుబాంబును తయారు చేశారు. జపాన్‌లోని హిరోషిమాపై ప్రయోగించిన అణు బాంబు కంటే దీని బరువు 2 కిలోటన్నులు తక్కువ. రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో ఉన్న పోఖ్రాన్ అనే మారుమూల ప్రదేశాన్ని ఈ అణు పరీక్ష కోసం ఎంచుకున్నారు. 1974 మే 18న ఉదయం 8.05 గంటలకు అణు పరీక్ష జరిగింది. ప్రణబ్ దస్తిదార్ మీట నొక్కి ఈ విస్ఫోటాన్ని నిర్వహించారు. పరీక్ష సక్సెస్ అయింది. వాతావరణంలో ఎలాంటి రేడియోధార్మికత కనిపించలేదు.ఈ అణు పరీక్షకు ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా’ అని పేరు పెట్టారు. బుద్ధ జయంతి కూడా అదే రోజు కావడంతో ఈ పేరు ఖరారు చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం దీన్ని పోఖ్రాన్-1గా నామకరణం చేసింది. ప్రపంచ దేశాల్లో ఆగ్రహావేశాలను చల్లార్చడానికి ఈ పరీక్షను ‘శాంతియుత అణు విస్ఫోటం’గా ఇందిర అభివర్ణించారు.