Davos Meet : దావోస్ లో `రాజధాని` సవాల్
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపైన ఆ రాష్ట్ర ప్రజలు చాలా హోప్స్ పెట్టుకున్నారు. తొలిసారిగా దావోస్ సదస్సుకు వెళ్లిన ఆయన విజయం సాధించే అంశంపై చర్చ జరుగుతోంది.
- By CS Rao Published Date - 11:57 AM, Mon - 23 May 22

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపైన ఆ రాష్ట్ర ప్రజలు చాలా హోప్స్ పెట్టుకున్నారు. తొలిసారిగా దావోస్ సదస్సుకు వెళ్లిన ఆయన విజయం సాధించే అంశంపై చర్చ జరుగుతోంది. సహజంగా జగన్ మైండ్ సెట్ వ్యాపార, వాణిజ్య రంగాలకు సరితూగేలా ఉంటుందని సహచరులు చెబుతుంటారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వివిధ కంపెనీల్లో ఆయన పెట్టిన పెట్టుబడులు అమాంతం పెరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. రియల్ ఎస్టేట్, మీడియా, స్టాక్ ఎక్సేంజ్ తదితర రంగాలపై పట్టుంది. ఫార్మా, వైద్య, తయారీ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు చాలా మంది సమీప బంధువులుగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో నెట్ వర్క్ ఆయనకు బలంగా ఉందని సన్నిహితులు భావిస్తుంటారు.
ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి రాజధాని ఏక్కడ అనేది దావోస్ సదస్సులోనూ ఆయన చెప్పలేరు. భారత పార్లమెంట్ సైతం ఏపీ రాజధాని గురించి పలు రకాలుగా చెప్పిన విషయం విదితమే. తాజాగా మంత్రి బొత్సా సత్యనారాయణ ఏపీ రాజధాని హైదరాబాద్ అంటూ చెప్పారు. 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాద్ ఉంటుందని తేల్చారు. ఆ కోణం నుంచి జగన్ దావోస్ సదస్సులో హైదరాబాద్ కు పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నస్తారా? అనే సందేహం కలగడం సహజం. మరో వైపు మంత్రి కేటీఆర్ మాత్రం టూ టైర్ సిటీలకు రావాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు పారిశ్రామికవేత్తలు రావాలని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పెట్టుబడుల స్వర్గధామంగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. పైగా భూములను చవకగా కొట్టేసేందుకు పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతారు. అందుకే, టూ టైర్ సిటీలను కేంద్రంగా చేసుకుని పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ వ్యూహాత్మకంగా తెలంగాణ రాష్ట్రాన్ని దావోస్ లో ప్రమోట్ చేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి దావోస్ కేంద్రంగా ఏపీ రాజధాని విషయం ఎదురుకావడం సర్వసాధారణం. పారిశ్రామికవేత్తలు స్టేట్ క్యాపిటల్ తెలియకుండా పెట్టుబడులు గుడ్డిగా పెట్టరు. మూడు రాజధానుల అంశాన్ని చెప్పినప్పటికీ ఆ ప్రతిపాదన ప్రస్తుతం బట్టదాఖలు అయింది. అధికారికంగా మూడు రాజధానుల ప్రతిపాదన ప్రస్తుతం లేనట్టే. ఆ క్రమంలో మూడు రాజధానుల అంశాన్ని దావోస్ కేంద్రంగా చెప్పినప్పటికీ పారిశ్రామికవేత్తలు నమ్మరు. పోనీ, అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్పలేరు. దీంతో పెట్టుబడుల ఆహ్వానం కోసం వెళ్లిన ఏపీ సీఎంకు దావోస్ సదస్సు ఒక సవాల్. మంత్రి కేటీఆర్ మాదిరిగా టూ టైర్ సిటీలు తిరుపతి, విశాఖ, విజయవాడ, కర్నూలుకు పెట్టుబడులను జగన్ ఆహ్వానించలేరు. ఎందుకంటే, పారిశ్రామికవేత్తలు ఆ సిటీల్లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన వనరులు ప్రస్తుతం పెద్దగా లేవు. కానీ, కోస్తా తీరం వెంబడి వ్యాపార, వాణిజ్యం చేసుకోవడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి. వాటిపై కన్నేసిన ఆదానీ గ్రూప్ హోల్ సేల్ గా సొంతం చేసుకోవడానికి చూస్తోంది. బహుశా అందుకే జగన్, ఆదానీ మధ్య కీలక భేటీ జరిగిందని తెలుస్తోంది.
మొత్తం మీద జగన్ కు దావోస్ సదస్సు లో ఏపీ రాజధాని అంశం ఒక సవాల్ కాగా, టూ టైర్ సిటీల ప్రతిపాదనతో కేటీఆర్ దూసుకుపోయారని తెలుస్తోంది. కోస్తా తీరం మినహా మిగిలిన ఏపీ సీటీల్లో పెట్టుబడులకు బదులుగా తెలంగాణ టూ టైర్ సిటీలు పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయట. అంతిమంగా దావోస్ సదస్సు రెండు రాష్ట్రాలకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో చూద్దాం!