MLC Kavitha: బిల్లును స్వాగతిస్తూనే బీసీ మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ కవిత
వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు.
- Author : Balu J
Date : 21-09-2023 - 11:12 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ల బిల్లును స్వాగతిస్తూనే బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న పోరాటాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు లోక్సభలో ఆమోదం పొందినందుకు దేశ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా ఉండే మహిళలు అధికారంలో కూడా సగం అని డిమాండ్ చేశామని అన్నారు.
వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉన్న కూడా ప్రభుత్వం అమలు చేయదలచుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. మహిళలు మరో ఐదు సంవత్సరాలు వేచి చూడాల్సి రావడం బాధాకరం అని ఉన్నారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు అవకాశాలు కల్పించకపోవడం బాధగా ఉందని, ఆత్మ లేకుండా శరీరం లా ఈ బిల్లు కూడా ఆత్మ కోల్పోయినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ వర్గం మహిళలైనా వెనుకబడేస్తే దేశం ముందుకు ఎలా వెళ్లగలుగుతుందో బిజెపి ప్రభుత్వమే ఆలోచించాలని ప్రశ్నించారు.
సబ్ కా వికాస్ సబక సాత్ అంటున్న బిజెపి నినాదంలో బీసీ మహిళలను చేర్చకపోవడం శోచనీయమని విమర్శించారు. బీసీ మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే ప్రస్తుతం బిల్లు ఆమోదించినందుకు ఉత్సవం చేసుకుంటామని, దేశ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.