KCR On Jagan : అన్నదమ్ముల మధ్య చెడిందా..!
ఇటీవల కేసీఆర్ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి పాలనను టార్గెట్ చేశాడు
- By CS Rao Published Date - 03:51 PM, Mon - 14 February 22

ఇటీవల కేసీఆర్ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి పాలనను టార్గెట్ చేశాడు. అసెంబ్లీ బయట, లోపల కూడా ఏపీ సీఎం చేతగానితనంపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో బిగించిన వ్యవసాయ మోటర్ల విద్యుత్ మీటర్ల గురించి ప్రస్తావించాడు. సుమారు 25వేల విద్యుత్ మీటర్లను ఏపీ సర్కార్ బిగించిందని తెలిపాడు. దానిపైన అధ్యయనం చేయాలని మీడియాకు కూడా సూచన చేశాడు. కేవలం ఎఫ్ ఆర్ బీఎం పరిధిని పెంచుకోవడానికి ఏపీ సర్కార్ కేంద్రానికి లొంగిందని కేసీఆర్ అన్నాడు. ఏడాది రూ. 5వేల కోట్లు వస్తాయని ఆశ పెట్టి విద్యుత్ మీటర్లను పెట్టించిందని తెలిపాడు. ఏపీ ప్రభుత్వం కండిషన్లంటికీ ఒప్పుకుందని వివరించాడు. కానీ, 25వేల కోట్లు కేంద్రం నుంచి రావని తెలిసి కూడా రైతుల కోసం తెలంగాణ సర్కార్ కేంద్రం షరతులకు దూరంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నాడు. అంటే, పరోక్షంగా జగన్ సర్కార్ మీద కేసీఆర్ విరుచుకుపడినట్టే.ఇక పలు సందర్భాల్లో ఏపీలోని జగన్ పాలన గురించి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాడు. ఏపీ ప్రగతి నిలిచిపోవడంతో తెలంగాణ భూముల ధరలు పెరిగాయని బాహాటంగా చెప్పాడు. ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో మూడు ఎకరాలు వచ్చేదని వివరించాడు. అదే, ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే, ఏపీలో మూడు ఎకరాలు వస్తుందని పరోక్షంగా జగన్ చేతగాని పాలన గురించి ప్రస్తావించాడు. అమరావతి ప్రాజెక్టు గందరగోళం కావడంతో తెలంగాణకు కలిసొచ్చిందని మంత్రి హరీశ్ రావు బాహాటంగా వేదికలపై చెప్పాడు. ఏపీ కంటే మెరుగైన పాలసీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులో బెటర్ గా తెలంగాణ ఉందని మంత్రి కేటీఆర్ చెబుతున్నాడు. అంతేకాదు, చంద్రబాబు విజన్ ను ఎవరూ కాదనలేరని మంత్రి కేటీఆర్ ప్రశసించిన సందర్భాలు అనేకం. ఆయనతో ఎవరూ పోటీపడలేరని కూడా చెప్పాడు. అంటే, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు స్పష్టం అవుతోంది.
అన్నదమ్ముల మాదిరిగా కలిసి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను పాలిద్దామని తొలి రోజుల్లో కేసీఆర్ స్నేహ హస్తం అందించాడు. తొలి రెండు భేటీలతో హైదరాబాద్ లోని ఏపీ కి చెందిన భవనాలను తెలంగాణకు జగన్ ఇచ్చేశాడు. ఆ తరువాత గోదావరి, కృష్ణా నదులపై భారీ ప్రాజెక్టులను నిర్మించడానికి కీలక భేటీలు ఇద్దరు సీఎంల మధ్య జరిగాయి. కేసీఆర్ మాస్టర్ స్కెచ్ ని గమనించిన ఏపీ అధికారులు జగన్మోహన్ రెడ్డిని అప్రమత్తం చేశారట. దీంతో గోదావరి, కృష్ణా నదులపై సుమారు రూ. 2లక్షల కోట్లతో భారీ ప్లాన్ వేసిన ప్రాజెక్టుల మ్యాప్ ఆదిలోపే ఆగిపోయింది. ఆ లోపు శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు వ్యవహారంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత కుదరలేదు. రెండు రాష్ట్రాలు ఇష్టానుసారంగా ఎవరికివారే శ్రీశైలం నీళ్లు తోడేశారు. పైగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విషయంలోనూ అన్మదమ్ములుగా మెలిగిన జగన్, కేసీఆర్ మధ్య పొరపొచ్చాలు వచ్చాయని తెలుస్తోంది. అంతేకాదు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల పెట్టడంపై కూడా ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చిందని సమాచారం. ఆమె పార్టీని క్లోజ్ చేయించాలని జగన్ మీద కేసీఆర్ ఒత్తిడి చేస్తున్నారని వినికిడి.ఏపీ మంత్రులు కూడా కేసీఆర్ ప్రభుత్వంపై అప్పుడప్పుడు పరోక్షంగా చురకలు వేయడానికి సాహసించారు. మంత్రులు పేర్ని నాని ఒకానొక సందర్భంలో తెలంగాణ పాలన గురించి ప్రస్తావించాడు. ఇటీవల ఉద్యోగుల పీఆర్సీ గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా చేయలేని విధంగా ఉద్యోగులకు సహాయం చేస్తున్నామని జగన్ అన్నాడు. ఇలా సమయం, సందర్భం చూసుకుని చాలా వ్యూహాత్మకంగా పరస్పరం కేసీఆర్, జగన్ విమర్శలకు దిగుతున్నట్టు లోతుగా ఆలోచిస్తే అర్థం అవుతోంది.
2019 రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ తాజాగా చంద్రబాబుకు దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్,టీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీ చేస్తే తిరుగులేకుండా కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. జాతీయ స్థాయిలోనూ బాబు సహాయంతో చక్రం తిప్పాలని కేసీఆర్ యోచిస్తున్నాడట. ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం కావడానికి కేసీఆర్ దోహదం చేసే అవకాశం లేకపోలేదు. ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీని విస్తరింప చేయాలని చాలా కాలంగా కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. ఈసారి అక్కడ పార్టీని పెట్టడంతో పాటు టీడీపీతో పొత్తుకు వెళ్లే అవకాశం కూడా ఉందని ఆ పార్టీలోని ఒక గ్రూప్ లో జరుగుతోన్న చర్చ. ఒక వేళ ఏపీలో పార్టీ పెట్టకపోయినప్పటికీ 2019లో ఏ విధంగా జగన్ కు సహాయసహకారాలు అందించాడో..ఆ విధంగా ఈసారి చంద్రబాబుకు అందించడానికి
గులాబీ బాస్ నిర్ణయించుకున్నాడట. సో..జగన్ కు ఈసారి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడన్నమాట.