Musi : మేం అందాల భామలతో పనిచేయడం లేదు – సీఎం రేవంత్
CM revanth Reddy : నగరం మధ్యలో నుంచి నది ప్రవహించే నగరం దేశంలోనే లేదు.. అలాంటి హైదరాబాద్ నగరం పాలకుల నిర్లక్ష్యంతో మురికి కూపంగా మారిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు
- By Sudheer Published Date - 06:53 PM, Thu - 17 October 24

మూసీ ప్రాజెక్టు (Development of Musi Riverfront)పై ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మూసీ నది పునరుజ్జీవనానికి బ్యూటిఫికేషన్ అనే కాస్మొటిక్ యాడ్ చేశారు. సుందరీకరణ ఎవరికి కావాలి? మేం చేస్తోంది కాలుష్యరహిత నగరం. మేం అందాల కోసం పనిచేయడం లేదు. అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు. మీకు అలాంటి ఆలోచన విధానం ఉందేమో నాకు తెలియదు. ప్రజలందరికీ తెలుసు’ అని పరోక్షంగా కేటీఆర్ (KTR) పై సీఎం విమర్శలు చేసారు.
కాంగ్రెస్ పార్టీ ఇటీవల మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన దగ్గరి నుండి బిఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..కీలక ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు సచివాలయంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పై విమర్శలు చేస్తున్న బిఆర్ఎస్ పై సీఎం విరుచుకపడ్డారు.
పేదల కోసం తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే, బీఆర్ఎస్, బీజేపీలు తమపై బురద జల్లుతున్నాయని సీఎం ఆగ్రహించారు. సర్కారు విధానాలపై ఆయా పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారమని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కార్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని, ఈ మేరకు అదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. యువతకు సైతం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇండస్ట్రీయల్ సెక్టార్ ను బలోపేతం చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ నగరం పాలకుల నిర్లక్ష్యంతో మురికి కూపంగా మారింది ..
మూసీ పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పనిచేసిందిని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అనేదానిపై దృష్టి సారించామని తెలిపారు. నగరం మధ్యలో నుంచి నది ప్రవహించే నగరం దేశంలోనే లేదు.. అలాంటి హైదరాబాద్ నగరం పాలకుల నిర్లక్ష్యంతో మురికి కూపంగా మారిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మూసీకి పునరుజ్జీవనం అందిస్తాం.. మూసీ విషయంలో చరిత్ర హీనులుగా మిగలకూడదని మంచి ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో కేటీఆర్ – హరీష్ రావు నివాసం ఉండాలి
మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునే నేతలు మూడు నెలలు ఆ పరీవాహక ప్రాంతంలో ఉండాలని CM రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. KTR,హరీశ్, ఈటల మూసీ ఒడ్డున ఇళ్లలో ఉంటే తానే కిరాయి చెల్లిస్తానన్నారు. లేదంటే ఖాళీ చేయించిన ఇళ్లలో అయినా ఉండొచ్చన్నారు. ఆ టైంలో వారికి ఆహారం సహా ఇతర సౌకర్యాలూ చెల్లించాలని కమిషనర్ దానకిషోర్ను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. వారు ఉండలేరని, ఉంటే ఈ ప్రాజెక్టు వెంటనే ఆపేస్తానని CM ఛాలెంజ్ విసిరారు.
తనకు ఇప్పటికే ఆస్తి, అంతస్తులు, పదవి అన్నీ వచ్చాయని , ఈ సమయంలో ఎవ్వరినో మోసం చేయాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేసారు. మూసీ ప్రాజెక్టుకు వెచ్చించే రూ.1.50 లక్షల కోట్లలో తాము ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదని సీఎం తెలిపారు. తమ మంత్రులు కూడా ప్రజలకు మేలు చేసేందుకే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్ట్ పనులు దక్కించుకున్న సంస్థపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘ముచ్చింతల్లో కెసిఆర్, మైహోం రామేశ్వర్, చినజీయర్ కలిసి సమతామూర్తి విగ్రహం ఏర్పాటు చేశారు. దాన్ని అద్భుతమంటూ స్వయంగా PM మోదీనే వచ్చి ఆవిష్కరించారు. ఆ విగ్రహం కట్టిన సంస్థే ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ పనులు చేపడుతోంది. అప్పుడు లేని ఆరోపణలు, అపోహలు ఇప్పుడెందుకు వస్తున్నాయి?’ అని ప్రశ్నించారు.
దామగుండం రాడార్ స్టేషన్ పై KTR అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ‘111 జీవో కింద గండిపేట వద్ద ఫాంహౌస్ కట్టుకున్న బుద్ధిలేని ఎదవ నీతులు చెబుతున్నారు. దేశ రక్షణ విషయంలో కొన్నిసార్లు రాజీపడాలి. మొన్న రాజ్నాథ్ సింగ్ వచ్చినప్పుడు నిరసన తెలపాల్సింది. ఆయన కారు కింద పడుకోకపోయినవ్? ఎవరు వద్దన్నారు? నిన్ను ఎవరైనా హౌస్ అరెస్ట్ చేశారా? లేదు కదా?’ అని ప్రశ్నించారు.
Read Also : KTR : సీఎం రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడం..