Warning Posters: పొంగులేటి ఖబర్ధార్
ఖమ్మం రాజకీయాలు దేశరాజకీయాలను తలపిస్తున్నాయి. రేపు ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ భారీ సభకు శ్రీకారం చుట్టింది.
- Author : Praveen Aluthuru
Date : 01-07-2023 - 2:09 IST
Published By : Hashtagu Telugu Desk
Warning Posters: ఖమ్మం రాజకీయాలు దేశరాజకీయాలను తలపిస్తున్నాయి. రేపు ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ భారీ సభకు శ్రీకారం చుట్టింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీల ఫోకస్ అంతా ఖమ్మంపైనే ఉంది. ఇదే రోజు భట్టివిక్రమార్క పాదయాత్ర కూడా ముగుస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా ఖమ్మం వ్యాప్తంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కు గురైన పొంగులేటి అనేక రాజకీయ చర్చల తరువాత కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఖమ్మంలో పొంగులేటి బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఆయనకు అనుచర వర్గం ఉంది. ఇక ఖమ్మంలో అధికార పార్టీ బీఆర్ఎస్ కు బలం లేకపోవడం కూడా పొంగులేటి ఇమేజ్ కి హెల్ప్ అయింది. దీంతో పొంగులేటి కాంగ్రెస్ లో జాయిన్ అవుతుండటంతో ఆయన ఇమేజ్ మరింత పెరగనుంది. రేపు రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మరోవైపు ఖమ్మం బీఆర్ఎస్ నేతలకు పొంగులేటికి మాటల యుద్ధం కొనసాగుతుంది. పొంగులేటిని లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు పువ్వాడ అజయ్ కుమార్. ఇదే సమయంలో పువ్వాడపై పొంగులేటి హాట్ కామెంట్స్ చర్చకు దారి తీస్తున్నాయి.
పొంగులేటి ఖబర్దార్ అంటూ హెచ్చరిక బోర్డులు కలకలం రేపుతున్నాయి. రేపు ఖమ్మలో భారీ సభ నేపథ్యంలో పొంగులేటికి వార్నింగ్ ఇస్తూ ఖమ్మంలో పోస్టర్లు వెలిశాయి. పొంగులేటికి వార్నింగ్ ఇస్తూ.. ఆయన అనుచరుల శవాలు కూడా మిగలవంటూ పోస్టర్లలో హెచ్చరించారు. పార్టీపై, మంత్రి పువ్వాడ అజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోస్టర్లో పేర్కొన్నారు. అయితే పోస్టర్లు ఎవరు చేశారన్నది తెలియాల్సి ఉంది.
Read More: Balasore Train Accident : ఒడిశా రైలు ప్రమాదం.. ఆ రెండు విభాగాలే దోషులు ?