Balasore Train Accident : ఒడిశా రైలు ప్రమాదం.. ఆ రెండు విభాగాలే దోషులు ?
Balasore Train Accident : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యులెవరు ? రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) విచారణలో ఏం తేలింది ?
- By Pasha Published Date - 02:03 PM, Sat - 1 July 23

Balasore Train Accident : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యులెవరు ?
ఇప్పటివరకు రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) విచారణలో ఏం తేలింది ?
అయితే 2 విభాగాలను దోషులుగా గుర్తించినట్లు రైల్వే బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంపై(Balasore Train Accident) రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) పరిధిలోని టీమ్ దర్యాప్తు చేస్తోంది. ఈ టీమ్ కీలక ఆధారాలను కూడగడుతోంది. బహనాగ రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే సిగ్నలింగ్, రైల్వే ఆపరేషన్స్ (ట్రాఫిక్) విభాగాల సిబ్బంది వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే సేఫ్టీ కమిషనర్ గుర్తించినట్టు తెలుస్తోంది. ఈమేరకు జూన్ 28న రైల్వే బోర్డుకు నివేదికను అందించినట్టు సమాచారం. బహనాగ రైల్వే స్టేషన్ పరిధిలో సిగ్నలింగ్ మరమ్మతు పనులు జరిగాయి. ఆ తర్వాత రైళ్లకు సిగ్నల్స్ ఇచ్చేముందు.. సిగ్నలింగ్ వ్యవస్థను పరీక్షించే భద్రతా ప్రోటోకాల్‌ను రైల్వే ఆపరేషన్స్ (ట్రాఫిక్) విభాగం పాటించలేదని విచారణలో తేలింది. రీకనెక్షన్ మెమో జారీ చేసిన తర్వాత కూడా సిగ్నలింగ్ సిబ్బంది ఇంకా పనిని కొనసాగించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి రైల్వే వ్యవస్థలో సిగ్నలింగ్ సిబ్బంది, స్టేషన్ మాస్టర్ ఇద్దరూ జవాబుదారీగా ఉంటారని పేర్కొన్నాయి.
Also read : Modi Option : ఎన్డీయేలో టీడీపీ భాగస్వామి? లేదా చంద్రబాబుకు చెక్.!
“రైల్వేలో ఏదైనా ఆస్తి నిర్వహణ చేపట్టినప్పుడు, రైళ్ల భద్రతకు సంబంధిత ఇంజనీరింగ్ సిబ్బందితో పాటు కార్యాచరణ (రైల్వే ఆపరేషన్స్) సిబ్బంది కూడా బాధ్యత వహిస్తారు. ట్రాక్ వర్క్ అయినా.. సిగ్నలింగ్‌కు సంబంధించిన వర్క్ అయినా అదే ప్రోటోకాల్ ఉంటుంది” అని రైల్వే బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈనేపథ్యంలో రైల్వే బోర్డు ఇటీవల ఖరగ్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) షుజాత్ హష్మీ, సౌత్ ఈస్టర్న్ రైల్వే సిగ్నలింగ్, సెక్యూరిటీ, వాణిజ్య విభాగాల అధిపతులను బదిలీ చేసింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ అర్చన జోషి కూడా బదిలీ అయ్యారు.