UPI Fraud Gang Arrested : తెలంగాణలో యూపీఐ స్కాం.. బజాజ్ షోరూంలకు కుచ్చుటోపీ పెట్టిన ముఠా
గత రెండు నెలల వ్యవధిలో ఈ ముఠా సభ్యులు దాదాపు 1,125 లావాదేవీలు చేశారని తెలంగాణ పోలీసులు(UPI Fraud Gang Arrested) విచారణలో గుర్తించారు.
- By Pasha Published Date - 04:50 PM, Mon - 9 September 24

UPI Fraud Gang Arrested : సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. యూపీఐ పేమెంట్ల పేరుతో ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఈ ముఠాలోని 13 మందిని తెలంగాణకు చెందిన సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా రాజస్థాన్ వాస్తవ్యులే. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ముఠా సభ్యులు దాదాపు రూ.4 కోట్ల దాకా యూపీఐ మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ముఠా సభ్యుల నుంచి రూ.1.72 లక్షల నగదుతో పాటు రూ.50 లక్షలు విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను జప్తు చేశారు.
Also Read : Autopsy Document Missing : జూనియర్ వైద్యురాలి పోస్టుమార్టం డాక్యుమెంట్ మిస్.. దీదీ సర్కారుపై ‘సుప్రీం’ ఫైర్
హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతో పాటు తెలంగాణవ్యాప్తంగా ఈ రాజస్థానీ ముఠా యూపీఐ మోసాలకు పాల్పడిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠా సభ్యులు తమ ప్రధాన టార్గెట్‌గా బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లను ఎంచుకునేవారు. ఆయా షోరూమ్‌లకు వెళ్లి వివిధ వస్తువులను కొనేవారు. అనంతం సదరు బజాజ్ షోరూమ్‌లోని క్యూఆర్ కోడ్‌ను రాజస్థాన్‌లోని తమ సహచరులకు పంపుతారు. అక్కడి నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తారు. ఆ వెంటనే వస్తువులను తీసుకొని బజాజ్ షోరూం నుంచి బయటపడతారు. ఈక్రమంలో పొరపాటున వేరే బ్యాంకు అకౌంటుకు డబ్బులను బదిలీ చేశామంటూ ఛార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా తిరిగి డబ్బును పొందుతారు. ఈవిధంగా మోసాలకు పాల్పడుతూ డబ్బులను కూడబెట్టారు. బజాజ్ షోరూంల నుంచి ఈవిధంగా మోసపూరితంగా కొన్న వస్తువులను ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. రాజస్థాన్‌కు చెందిన 20 నుంచి 25 ఏళ్లలోపు యువకులు ముఠాగా ఏర్పడి ఈ తరహా మోసాలు చేసేవారని వెల్లడైంది. గత రెండు నెలల వ్యవధిలో ఈ ముఠా సభ్యులు దాదాపు 1,125 లావాదేవీలు చేశారని తెలంగాణ పోలీసులు(UPI Fraud Gang Arrested) విచారణలో గుర్తించారు. ఇలాంటి ముఠాలతో జాగ్రత్తగా ఉండాలని మర్చంట్ అకౌంట్స్ కలిగిన యూపీఐ వినియోగదారులకు పోలీసులు సూచిస్తున్నారు.