Musi River Project : ‘మూసీ రివర్ ఫ్రంట్’ గురించి పార్లమెంటులో ప్రస్తావన.. బీఆర్ఎస్ ఎంపీకి కేంద్ర మంత్రి సమాధానం
ఆ ప్రాజెక్టు(Musi River Project) కోసం పెద్దఎత్తున ప్రజల నివాసాల కూల్చివేతలు ఉండవని, పెద్దసంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు కారని తమకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని టోఖన్ సాహూ చెప్పారు.
- Author : Pasha
Date : 27-11-2024 - 4:53 IST
Published By : Hashtagu Telugu Desk
Musi River Project : హైదరాబాద్‌లో చేపట్టనున్న ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు’ గురించి ఇవాళ పార్లమెంటు సెషన్‌లో ప్రస్తావన వచ్చింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి నగర ప్రజల నుంచి వస్తున్న ఆందోళనల గురించి రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి మాట్లాడారు. ఈమేరకు ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోఖన్ సాహూ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు’ గురించి తమకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోందని మంత్రి తెలిపారు. మూసీ నదీ పునరుజ్జీవం కోసమే ఈ ప్రాజెక్టును తెలంగాణ సర్కారు చేపట్టిందని పేర్కొన్నారు.
Also Read :Rich Habits : ధనవంతులుగా ఎదగాలంటే ఈ సీక్రెట్స్ తెలుసుకోండి..
ఆ ప్రాజెక్టు(Musi River Project) కోసం పెద్దఎత్తున ప్రజల నివాసాల కూల్చివేతలు ఉండవని, పెద్దసంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు కారని తమకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని టోఖన్ సాహూ చెప్పారు. ఒకవేళ తొలగింపులు, తరలింపులు చేస్తే బాధిత కుటుంబాల కోసం సహాయ పునరావాస చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం తమకు తెలిపిందని ఆయన వెల్లడించారు.మూసీ నదీ గర్భం నుంచి, బఫర్ జోన్ నుంచి తరలించే వారికోసం 15 వేల ఇళ్లను కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తమకు తెలియజేసిందని కేంద్ర మంత్రి వివరించారు. బాధిత కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఒక కమిటీని నియమించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపిందన్నారు.
Also Read :Zainab Ravdjee : అఖిల్‌కు కాబోయే భార్య జైనబ్.. వయసులో తొమ్మిదేళ్లు పెద్దదా ?
మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు కోసం త్వరలోనే మూసీ నది ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలను తొలగించనున్నారు. ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. ఈ తొలగింపులో సర్వం కోల్పోయే కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత కుటుంబాల జాబితాను కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు.