Telangana BJP: అధ్యక్షుడి మార్పుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి .. బండి, ఈటల ఎడమొహం పెడమొహం
కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి బండి సంజయ్ కు కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని బీజేపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆదివారం బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌లు హన్మకొండ వెళ్లారు.
- Author : News Desk
Date : 02-07-2023 - 7:05 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ బీజేపీ (Telangana BJP) లో అధ్యక్షుడి మార్పు విషయం కొద్దికాలంగా రచ్చరేపుతోంది. అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్ (Bandi Sanjay) ను తొలగించేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం సిద్ధమైందన్న వాదనను ఆ పార్టీలోకి కొందరు నేతలు వినిపిస్తున్నారు. మరికొందరు నేతలు అలాంటిదేమీ లేదని స్పష్టం చేస్తున్నారు. ఇలా రెండు వర్గాలుగా పార్టీ నేతలు విడిపోవటంతో ఆ పార్టీలో వర్గ విబేధాలు తారా స్థాయికి చేరాయి. ఇదే సమయంలో.. గతవారం క్రితం బీజేపీ నేత జితేందర్ రెడ్డి చేసిన వీడియో ట్వీట్ ఆ పార్టీలో పెద్ద దుమారాన్ని రేపింది. జితేందర్ తీరుపై ఈటలసైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈటల వర్సెస్ బండి సంజయ్ అన్నట్లు తెలంగాణ బీజేపీ రాజకీయాలు మారాయి. తెలంగాణలో నేతల మధ్య విబేధాలకు స్వస్తిచెప్పేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది.
కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి బండి సంజయ్ కు కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆదివారం బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌లు హన్మకొండ వెళ్లారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముగ్గురు నేతలు హన్మండ వెళ్లారు. అక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మార్పులపై వస్తున్న వార్తలు ఊహాగానాలేనని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పేశారు.
హన్మకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అయితే, ఈటల, బండి సంజయ్ ఎడమొహం పెడమొహంలానే ఉన్నారు. ఒకే వేదికపై ముగ్గురు నేతలు పాల్గొన్నప్పటికీ ఈటల, సంజయ్ మాత్రం మాట్లాడుకున్న పరిస్థితి పెద్దగా కనిపించలేదు. మరోవైపు ఇటీవల ట్విటర్‌లో వీడియో షేర్‌చేసి పార్టీలో పెద్ద దుమారాన్ని రేపిన జితేందర్ రెడ్డి సైతం ఈటలకు దూరంగా కూర్చోవటం గమనార్హం.
Mayor Marriage With Crocodile: ఇదేందయ్యా ఇది.. మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్.. ఎందుకంటే?