TS TET 2023: టెట్ నోటిఫికేషన్ విడుదల.. సెప్టెంబర్ 15న పరీక్ష.. రేపటి నుంచి దరఖాస్తులు..!
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) (TS TET 2023) నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
- By Gopichand Published Date - 01:31 PM, Tue - 1 August 23

TS TET 2023: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) (TS TET 2023) నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షా ఫలితాలు సెప్టెంబర్ 27న వెల్లడించనున్నారు. అయితే, టెట్ పరీక్షకోసం రేపటి (బుధవారం) నుంచి ఈనెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. పేపర్ -1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్ -2తో పాటు పేపర్-1 పరీక్షకూడా రాసుకోవచ్చు.
ఇటీవల జరిగిన సమావేశంలో టెట్ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తు చేసి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు.
Also Read: TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు!
తాజా అంచనాల ప్రకారం రాష్టంలో 1.5 లక్షల డీఎడ్, 4.5 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 టీచర్ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్ వారికే ఇవ్వగా, ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది టెట్ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకుంటారు.
ఇంపార్టెంట్ డేట్స్
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16
రాతపరీక్ష: సెప్టెంబర్ 15
పేపర్-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
పరీక్ష ఫీజు: రూ.400
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
వెబ్‌సైట్: https://tstet.cgg.gov.in