Tamilisai : తెలంగాణలో గవర్నర్ పాలన?
సమయం, సందర్భాన్ని బట్టి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ అస్త్రాలను తీస్తుంటారు. మొన్న `రెడ్డి` రాజ్యాధికారం అస్త్రాన్ని తీసిన ఆయన ఇప్పుడు సెక్షన్ 8 ను బయటకు తీశారు.
- By CS Rao Published Date - 03:30 PM, Fri - 10 June 22

సమయం, సందర్భాన్ని బట్టి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ అస్త్రాలను తీస్తుంటారు. మొన్న `రెడ్డి` రాజ్యాధికారం అస్త్రాన్ని తీసిన ఆయన ఇప్పుడు సెక్షన్ 8 ను బయటకు తీశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన మీద సెక్షన్ 8 కింద గవర్నర్ జోక్యం చేసుకోవచ్చని చెబుతున్నారు. గవర్నర్ తమిళ సై రాష్ట్రంలోని శాంతిభద్రతలపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే గత రెండు వారాలుగా తెలంగాణ వ్యాప్తంగా రేప్ లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కదిలేకారులో హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన గ్యాంగ్ రేప్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
రెండు వారాల నుంచి ఏడు రేప్ కేసులు వెలుగుచూశాయి. ఇంకా వెలుగులోకి రాని కేసులు ఉన్నాయని విపక్షాలు అనుమానిస్తున్నాయి. శాంతిభద్రతలకు భంగం కలుగుతోందని ఆందోళన చెందుతున్నాయి. అందుకే, సెక్షన్ 8 కింద గవర్నర్ జోక్యం చేసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. విభజన చట్టం ప్రకారం సెక్షన్ 8 కింద హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ను గవర్నర్ ఏ రోజైన పర్యవేక్షించడానికి అవకాశం ఉంది. గవర్నర్ జోక్యం చేసుకోవాలని కూడా ఆ సెక్షన్ చెబుతోంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన సందర్భంగా సెటిలర్లకు రక్షణగా సెక్షన్ 8ను ఉంచారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 2024 వరకు ఉంది. అప్పటి వరకు సెక్షన్ 8 పనిచేస్తోంది. ఒక వేళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను పొడిగిస్తే సెక్షన్ 8 కూడా పొడిగింప పడుతుంది.
విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 కింద విలువైన ఆస్తుల పంపకం ఇంకా జరగలేదు. సుమారు 5లక్షల కోట్ల విలువైన ఆస్తులు తెలంగాణ వ్యాప్తంగా ఏపీకి ఉన్నాయి. ఆ ఆస్తుల పంపకం పూర్తి అయ్యే వరకు విభజన చట్టం అమలులో ఉంటుంది. అంటే, సెక్షన్ 8 కూడా దీర్ఘకాలం పదిలంగా ఉంటుంది. ఆ సెక్షన్ ఆధారంగా హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పితే నేరుగా గవర్నర్ జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాదు, తెలంగాణ వ్యాప్తంగా గవర్నర్ పాలన తీసుకురావడానికి సెక్షన్ 8 ఒక అస్త్రంగా రాజ్ భవన్ ఉపయోగించుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇటీవల కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య. జరుగుతోన్న యుద్ధ వాతావరణ గమనిస్తే రాబోవు రోజుల్లో గవర్నర్ పాలన తెలంగాణలో వచ్చినప్పటికీ ఆశ్చర్య పోవాల్సిన అవసరంలేదు.
జూలై 2న బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం హైదరాబాద్ లో జరగనుంది. ఆ సందర్భంగా ప్రధాని మోడీ ర్యాలీతో పాటు సభను కూడా నిర్వహించనున్నారు. ఆ రోజు నుంచి బీజేపీ మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది. చార్మినార్ పక్కన ఉండే భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి దూకుడు పెంచాలని బీజేపీ యోచిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే లా అండ్ ఆర్డర్ ప్రశ్నార్థకంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రాబోవు రోజుల్లో గవర్నర్ పాలన వచ్చేలా పరిస్థితులు ఉంటాయని పలువురు భావిస్తున్నారు.