RTC : ఆర్టీసీలో త్వరలో ఆ బస్సులు.. ఎవరైనా టికెట్ కొనాల్సిందే
తెలంగాణ ఆర్టీసీ వ్యూహం మార్చింది. ప్రతి ఒక్కరు టికెట్ తీసుకోవాల్సిన బస్సు సర్వీసులను పెంచే దిశగా అడుగులు వేస్తోంది.
- By Pasha Published Date - 07:52 AM, Thu - 8 August 24

RTC : తెలంగాణ ఆర్టీసీ వ్యూహం మార్చింది. ప్రతి ఒక్కరు టికెట్ తీసుకోవాల్సిన బస్సు సర్వీసులను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలో త్వరలోనే కొత్త రకం సెమీ డీలక్స్ బస్సులను ప్రారంభించనుంది. వీటిలో మినిమం బస్ ఛార్జీ రూ.30. టోల్ ఫీజు, ప్యాసింజర్ సెస్, సేఫ్టీ సెస్ వంటివి అదనంగా కలిపి ఛార్జీని కట్టాల్సి ఉంటుంది. ఉచిత ప్రయాణ స్కీం వల్ల ఆర్టీసీకి(RTC) టికెట్ల సేల్స్ నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఆదాయం గ్రాఫ్‌ను పెంచుకునే దిశగా ఇప్పుడు కసరత్తు జరుగుతోంది. ఈక్రమంలోనే కొత్త రకం సెమీ డీలక్స్ బస్సులను తీసుకొస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రస్తుతం ఉచిత ప్రయాణ స్కీంను అమలు చేస్తోంది. దీంతో వారంతా ఉచితంగానే ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే కొత్త రకం సెమీ డీలక్స్ బస్సుల్లో ఆ వసతి ఉండదు. తొలి దశలో రాష్ట్రంలో 50 సెమీడీలక్స్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సెమీడీలక్స్ బస్సులను ఆర్టీసీ కొద్దిరోజుల క్రితమే కరీంనగర్ సహా పలు రీజియన్లకు పంపినట్లు సమాచారం. వీటిలో ప్రతి కి.మీ.కు సగటు ఛార్జి 137 పైసలు ఉంటుందని తెలుస్తోంది. ఈ వివరాల్ని తాజాగా ఈడీలు, రీజినల్ అధికారులకు ఆర్టీసీ పంపింది.
Also Read :Vinesh Phogat Retirement : వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం.. రెజ్లింగ్ నుంచి రిటైర్‌మెంట్
ప్యాసింజర్ ఫీజు కింద రూ.5, సేఫ్టీ ఫీజు కింద రూ.1, అదనంగా రూ.6 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ తరహా ఛార్జీలన్నీ ఇప్పటికే ఇతర బస్సుల్లోనూ ఉన్నాయి. సెమీడీలక్స్ బస్సు ప్రయాణించే రూటులో టోల్ గేట్లు ఉంటే, ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.13 చొప్పున టోల్ ఛార్జీని కూడా వసూలు చేస్తారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ ఆర్థికంగా దెబ్బతింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఎక్స్‌ప్రెస్ తరహా బస్సులనే రంగు, రూపం కొంత మార్చి సెమీడీలక్స్ పేరుతో ఆర్టీసీ తీసుకొస్తోందని పలువురు అంటున్నారు. ఈ బస్సుల్లో సీట్లు, ఇతర సౌకర్యాలు ఎలా ఉంటాయన్నది త్వరలోనే మనం చూస్తాం.