Chevella Bus Accident : రోడ్లు బాగుండకపోవడం వల్లే ఈ ప్రమాదాలు..ఎమ్మెల్యే ను త తరిమేసిన జనం
Chevella Bus Accident : రంగారెడ్డి జిల్లాలో జరిగిన చేవెళ్ల బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్, ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఘోర విషాదం చోటుచేసుకుంది
- By Sudheer Published Date - 11:04 AM, Mon - 3 November 25
రంగారెడ్డి జిల్లాలో జరిగిన చేవెళ్ల బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్, ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఘోర విషాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న 70 మందిలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మరికొంతమంది గాయపడగా, కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. టిప్పర్ ఢీకొట్టిన వేళ బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై, ప్రయాణికులు సీట్లలో ఇరుక్కుపోయారు. కంకర బస్సులోకి పడి ముందు వరుసలోని సీట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ దృశ్యం చూసిన వారంతా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు చేరుకుని గాయపడిన వారిని చేవెళ్ల, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించాయి.
Shani: శని ప్రభావం వద్దని అనుకుంటున్నారా.. అయితే అదృష్టాన్ని కాలదన్నుకున్నట్లే!
ఈ ప్రమాదం రోడ్ల దయనీయ పరిస్థితిని మరోసారి వెలుగులోకి తెచ్చింది. స్థానికులు చాలా కాలంగా ఈ మార్గంలో రోడ్డు విస్తరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు జరగలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద స్థలానికి ఆలస్యంగా చేరుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్యను ప్రజలు తీవ్రంగా ప్రశ్నించారు. “ఎన్నిసార్లు రోడ్డు పనులు చేయమని అడిగాం, కానీ ఎవరూ పట్టించుకోలేదు. రోడ్లు సరిగా ఉంటే ఈరోజు ప్రాణాలు బలికేవు” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆగ్రహం పెరగడంతో ఎమ్మెల్యే ఘటనాస్థలం నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.
ప్రస్తుతం ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ, సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయించారు. సీఎస్, ఆర్టీసీ ఎండీ, రవాణా కమిషనర్, ఫైర్ డీజీ తదితర అధికారులను అలర్ట్ చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదం వెనుక కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. రోడ్ల నాణ్యత, వాహనాల వేగ పరిమితులు, డ్రైవర్ నిర్లక్ష్యం వంటి అంశాలపై నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ ఘటన మళ్లీ రోడ్డు భద్రత, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వాలు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రశ్నను తెరపైకి తెచ్చింది.