Ration Card KYC : రేషన్ కార్డు కేవైసీకి గడువుపై క్లారిటీ.. పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన
Ration Card KYC : రేషన్ కార్డు కేవైసీపై.. దానికి సంబంధించిన డెడ్ లైన్ పై తెలంగాణ ప్రజల్లో గందరగోళంలో నెలకొంది.
- Author : Pasha
Date : 02-10-2023 - 11:31 IST
Published By : Hashtagu Telugu Desk
Ration Card KYC : రేషన్ కార్డు కేవైసీపై.. దానికి సంబంధించిన డెడ్ లైన్ పై తెలంగాణ ప్రజల్లో గందరగోళంలో నెలకొంది. ఈ తరుణంలో పౌరసరఫరాల శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డు కేవైసీ చేసుకునేందుకు ఎలాంటి తుది గడువు లేదని స్పష్టం చేశారు. దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. కేవైసీ చేయించుకోని వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగిస్తారనేది పూర్తిగా దుష్ప్రచారమని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల లబ్ధిదారుల కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాల అమలులో భాగంగానే ఈ ప్రక్రియను రేషన్ షాపుల్లో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జనవరిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
Also read : NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో NIA దాడులు, ఎందుకో తెలుసా?
మరోవైపు రేషన్ కార్డులకు కేవైసీ చేసుకునేందుకు ప్రజలు రేషన్ షాపుల ఎదుట క్యూ కడుతున్నారు. రేషన్ కార్డులో పేర్లున్న అందరి నుంచి రేషన్ డీలర్లు ఈ-పాస్ మిషన్ లో ఈ- వేలి ముద్రలను తీసుకుంటున్నారు. ఈ-పాస్ మిషన్ లో వేలిముద్ర వేసినప్పుడు ఆధార్ కార్డు నంబర్ తో పాటు రేషన్ కార్డు నంబర్ కనిపిస్తుంది. ఆ తర్వాత గ్రీన్ లైట్ వస్తే మీ కేవైసీ విజయవంతంగా అయినట్టు అర్థం చేసుకోవాలి. ఒకవేళ రెడ్ లైట్ వస్తే మీ ఆధార్ కార్డు వివరాలు, రేషన్ కార్డులోని వివరాలతో మ్యాచ్ కాలేదని అర్థం. అప్పుడు రేషన్ కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలి. అయితే ఈక్రమంలో కొందరికి బయోమెట్రిక్ సరిగ్గా రావడంలేదు. దీంతో వారు ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. కొందరికి ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయింది. అలాంటి వారు బయోమెట్రిక్ అన్ లాక్ చేసుకుని బయోమెట్రిక్ థంబ్ వేయాల్సి ఉంటుంది. కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను (Ration Card KYC) జారీ చేయనుంది.