Sarpanch Elections: పంచాయతీ ఎన్నికలపై వీడనున్న ఉత్కంఠ.. రేపు హైకోర్టు తీర్పు!
పిటీషనర్లు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243E, 243K, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం.. పంచాయతీ పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని, ఆలస్యం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
- By Gopichand Published Date - 08:58 PM, Tue - 24 June 25

Sarpanch Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Sarpanch Elections) నిర్వహణపై రేపు (జూన్ 25) తెలంగాణ హైకోర్టు తన తీర్పును వెలువరించనుంది. జస్టిస్ టి. మాధవి దేవి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో తీర్పును రిజర్వు చేసింది. గత జనవరి 31, 2024న గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసినప్పటికీ, 18 నెలలైనా ఎన్నికలు నిర్వహించకపోవడంపై నల్గొండ జిల్లాకు చెందిన మాజీ సర్పంచులు సహా ఆరు పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లపై జూన్ 23, 2025న వాదనలు ముగిశాయి.
పిటీషనర్లు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243E, 243K, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం.. పంచాయతీ పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని, ఆలస్యం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల ద్వారా పంచాయతీల నిర్వహణను పిటీషనర్లు వ్యతిరేకిస్తూ, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు.
Also Read: India vs England: పదే పదే వర్షం.. డ్రా దిశగా భారత్- ఇంగ్లాండ్ మొదటి టెస్ట్!
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ వెనుకబడిన తరగతుల (BC) జనాభా గణన పూర్తి కాకపోవడంతో రిజర్వేషన్ ప్రక్రియకు సమయం కావాలని, ఒక నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సీనియర్ కౌన్సెల్ విద్యాసాగర్, ఎన్నికల నిర్వహణకు కనీసం 60 రోజుల సమయం అవసరమని కోర్టుకు తెలిపారు.
హైకోర్టు గతంలో ప్రభుత్వం ఫిబ్రవరి 2025లోగా ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఆరు నెలలు గడిచినా చర్యలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం, ప్రభుత్వం ఆలస్యాన్ని జస్టిస్ మాధవి దేవి తప్పుబట్టారు. రాజ్యాంగం ప్రకారం పంచాయతీల పదవీకాలం ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాలని గుర్తు చేశారు. ఈ తీర్పు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను నిర్దేశించే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ, రిజర్వేషన్ ప్రక్రియ సమతుల్యతపై కోర్టు ఏ విధమైన ఆదేశాలు ఇస్తుందనే దానిపై రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.