MLA Padi Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఇంటివద్ద టెన్షన్..టెన్షన్
MLA Padi Kaushik Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్ఈయూఐ, కౌశిక్ రెడ్డి నివాసం వద్ద నిరసన చేపట్టేందుకు పిలుపు ఇవ్వడం
- By Sudheer Published Date - 12:38 PM, Sat - 26 July 25

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి రాజకీయం వేడెక్కించగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్ఈయూఐ, కౌశిక్ రెడ్డి నివాసం వద్ద నిరసన చేపట్టేందుకు పిలుపు ఇవ్వడం, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కౌశిక్ రెడ్డి ఇంటివద్ద బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకోవడం, మరోవైపు నిరసనకారుల పిలుపుతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సహా పలువురు నేతలు అక్కడకు చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకరావడం కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
IRCTC : రైళ్లలో ఆహార నాణ్యతపై పెరుగుతున్న ఫిర్యాదులు..కేంద్ర మంత్రిత్వ శాఖ స్పందన
ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలతో విచారణ జరపాలని డిమాండ్ చేసిన కౌశిక్ రెడ్డి, రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నారని అన్నారు. 118 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, బ్యూటీ కాంటెస్టులకు వచ్చిన మహిళల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అర్ధరాత్రి ‘మై హోమ్ భుజా’కు ఎందుకు వెళ్లారో ప్రజలకు తెలియజేయాలన్నారు.
కౌశిక్ రెడ్డికి మద్దతుగా నిలిచిన బీఆర్‌ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తున్నారని, రేవంత్ మానసిక స్థిరత్వం కోల్పోయారని ఆరోపించారు. ఫార్ములా ఈ రేసుపై కూడా రేవంత్ తప్పుదోవ పట్టిస్తున్నారని, అది క్లీన్‌గా జరిగినదేనని మంత్రులే చెబుతున్నారని గుర్తుచేశారు. తమ పార్టీపై బురద చల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు ఖండిస్తారని హెచ్చరించారు.