Telangnana Assembly Session: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికారులకు సెలవులు రద్దు
రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌ఓడీలు తమ సెలవులను రద్దు చేసి అసెంబ్లీ సమావేశాల సమయంలో అందుబాటులో ఉండాలని కోరింది. సభలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని మంత్రులకు అందించే బాధ్యతను కార్యదర్శులకు అప్పగించారు.
- By Praveen Aluthuru Published Date - 11:59 AM, Sun - 21 July 24

Telangnana Assembly Session: ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉంది. కాగా ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధిత అధికారులకు సెలవులు రద్దు చేసింది.
రాష్ట్రంలో వివిధ అంశాలపై రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో ఇరు పార్టీల మధ్య సమరం వాడివేడిగా సాగనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌ఓడీలు తమ సెలవులను రద్దు చేసి అసెంబ్లీ సమావేశాల సమయంలో అందుబాటులో ఉండాలని కోరింది. సభలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని మంత్రులకు అందించే బాధ్యతను కార్యదర్శులకు అప్పగించారు.
శాసనసభ్యులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సత్వరమే పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆమె శనివారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బడ్జెట్ సెషన్‌లో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: All-Party Meeting: బడ్జెట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు