Telangana Thalli Statue: తెలంగాణ తల్లి విగ్రహ నమూనా విడుదల… విగ్రహ ప్రత్యేకతలివే..
తెలంగాణ తల్లి కొత్త విగ్రహ ప్రతిష్ఠాపనకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని రూపొందించగా, కొత్త విగ్రహ నమూనా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- By Kode Mohan Sai Published Date - 12:31 PM, Sat - 7 December 24

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా 17 అడుగుల ఎత్తుతో కొత్త విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ప్రొఫెసర్ గంగాధర్ నేతృత్వంలో, ప్రముఖ రూపశిల్పి ఎంవీ రమణారెడ్డి ఈ విగ్రహాన్ని రూపొందించారు. పూర్వపు తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా ప్రొ. గంగాధర్ రూపకల్పన చేసింది. ప్రస్తుతం, సెక్రటేరియట్‌లో ప్రతిష్ఠించడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అచ్చమైన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా మన తెలంగాణ తల్లి విగ్రహం:
1. తెలంగాణ ఆడబిడ్డల కట్టు, బొట్టు ఉట్టిపడేలా.. ప్రసన్న వదనంతో ఉండే నిండైన రూపం.
2. చూడగానే తెలంగాణ తల్లి మన ఇంటి ఆడబిడ్డ అవతారం ఎత్తినట్లుగా కనిపించే ముఖారవిందం.
3. మెడలో బంగారు తీగ – ఎన్ని ఆభరణాలున్నా,… pic.twitter.com/BDKZrBSgIR
— Telangana Congress (@INCTelangana) December 6, 2024
తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేకతలు:
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆకుపచ్చ చీరలో నిలబడి ఉన్నట్లుగా రూపొందించారు. కుడి చేతితో తెలంగాణ ప్రజలకు అభయహస్తం చూపుతూ, ఎడమ చేతిలో రాష్ట్రంలో పండించే ముఖ్యమైన పంటలు – వరి, మొక్కజొన్న, సజ్జ కంకులు – అందుబాటులో ఉన్నాయి. ఈ అంశాలు గ్రామీణ జీవన విధానాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తాయి.
విగ్రహం మెడలో తెలంగాణ ఆడపడుచులు ధరించే తీగ, చేతుల్లో ఆకుపచ్చ గాజులు, బంగారు అంచుతో ఆకుపచ్చ చీరకట్టుతో కనిపిస్తుంది. ఈ వస్త్రధారణలో ఆకుపచ్చ రంగు పచ్చని పంటలను, ఎరుపు రంగు చాకలి ఐలమ్మ వంటి తెలంగాణ ధీరవనితల పోరాటాన్ని ప్రతిబింబిస్తుంది.
విగ్రహ పీఠంపై బిగించిన పిడికిళ్లు, తెలంగాణ తల్లికి దాస్య విముక్తి కల్పించిన స్థానిక బిడ్డల పోరాటాలకు ప్రతీకగా రూపుదాల్చబడ్డాయి. ఇవి తెలంగాణ పోరాట స్పూర్తిని తెలియజేస్తాయి. ఈ విగ్రహాన్ని ఈనెల 9న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్, గవర్నర్ జిష్ణుదేవ్ తదితర ప్రముఖులు ఆహ్వానితులుగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.