Driving License : ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్.. షోరూం నుంచే వాహన రిజిస్ట్రేషన్
ఆయాచోట్ల ఇప్పటికే ఆన్ లైన్‌లో డ్రైవింగ్ లైసెన్సులు(Driving License) జారీ చేస్తున్నారు.
- By Pasha Published Date - 07:49 AM, Mon - 24 February 25

Driving License : తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్సుల జారీలో మార్చి మొదటి వారం నుంచి కీలక మార్పు జరగబోతోంది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందొచ్చు. వాహనాన్ని కొన్న షోరూం నుంచే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. తొలుత ప్రయోగాత్మకంగా ఈ సేవలను సికింద్రాబాద్ ఆర్టీఏ ఆఫీసులో అందించనున్నారు. తదుపరిగా విడతల వారీగా అన్ని జిల్లాల్లోని ఆర్టీఏ ఆఫీసులకు ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తారు.
Also Read :Record in Cricket History : భారత్ vs పాక్ మ్యాచ్‌కు 60 కోట్ల వ్యూస్
ఏమిటీ ‘వాహన్’, ‘సారథి’ ?
‘వాహన్’, ‘సారథి’ అనేవి కేంద్ర రవాణాశాఖకు చెందిన రెండు వేర్వేరు ఆన్‌లైన్ పోర్టల్‌లు. వాహన్ పోర్టల్ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతర ప్రాంతాలకు వాహనాల బదిలీ, యజమానుల పేరు మార్పు వంటివి ఆన్ లైన్‌లో చేస్తారు. కొత్తగా వాహనం కొంటే షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. సారథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సును ఆన్‌లైన్‌లో ఇంటి నుంచే పొందొచ్చు. గడువు ముగిసిన లైసెన్స్‌ను ఆన్ లైన్‌లోనే రెన్యూవల్ చేసుకోవచ్చు. ఈ రెండు పోర్టల్‌లను ‘నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్’ (ఎన్‌ఐసీ) నిర్వహిస్తుంది.
రాష్ట్రంలో ఎందుకింత ఆలస్యంగా.. ?
2016లోనే వాహన్, సారథి పోర్టల్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అప్పుడే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేరాయి. ఆయాచోట్ల ఇప్పటికే ఆన్ లైన్‌లో డ్రైవింగ్ లైసెన్సులు(Driving License) జారీ చేస్తున్నారు. అయితే ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈ పోర్టల్లలో చేరలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో చేరేందుకు ఆసక్తిని కనబర్చింది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలోనూ ఆన్ లైన్‌లో రవాణా శాఖకు సంబంధించిన అన్ని పనులను ఇంటి నుంచే చేసుకునే వెసులుబాటు కలగబోతోంది.
Also Read :Liquor Brands : కొత్త బ్రాండ్లు వచ్చేస్తున్నాయి..మందుబాబులకు కిక్కే కిక్కు
డ్రైవింగ్ లైసెన్స్ రకాలు
- డ్రైవింగ్ నేర్చుకునే వ్యక్తులకు లెర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. ఇది ఆరు నెలలు చెల్లుబాటు అవుతుంది.
- ఆర్‌టీఓ నిర్వహించే డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వ్యక్తులకు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు.
- ట్రక్కులు, బస్సులు లేదా టాక్సీలు వంటి వాణిజ్య వాహనాలను నడిపే వారికి కమర్షియల్ డ్రైవర్ లైసెన్స్ జారీ చేస్తారు.
- భారతీయ పౌరులు విదేశాలలో వాహనాలు నడపడానికి అనుమతించేదే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్.
- ఇప్పటికే హెవీ వెహికల్ లైసెన్స్‌లు ఉన్న డ్రైవర్లకు హెవీ ట్రైలర్ లైసెన్స్ అందిస్తారు.
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఫీజులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి.
- శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ సాధారణంగా జారీ చేసిన తేదీ నుంచి 20 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది.
- ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (IDP) కోసం అసలు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ అవసరం.