BC Reservation Bills : బీసీ రిజర్వేషన్ల బిల్లులకు తెలంగాణ శాసనమండలి ఆమోదం..నిరవధిక వాయిదా
ఈ హంగామా మధ్య పలు కీలక బిల్లులు, ముఖ్యంగా పురపాలక, పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లులు చట్టంగా మారిన తరువాత మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకావొచ్చు.
- By Latha Suma Published Date - 11:50 AM, Mon - 1 September 25

BC Reservation Bills : తెలంగాణ శాసనసభలో ఆదివారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లులు ఆమోదం పొందిన తరువాత, సోమవారం శాసనమండలిలో ఈ బిల్లులపై చర్చ ప్రారంభమైంది. ఒకవైపు బీసీ రిజర్వేషన్ బిల్లులపై సభ్యులు చర్చ కొనసాగిస్తుండగా, మరోవైపు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జరిగిన నివేదికపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ముఖ్యంగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్రంగా వ్యతిరేకించారు. శాసనమండలిలో చర్చ ఉద్రిక్తతకు దారి తీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పోడియాన్ని ముట్టడి చేయగా, సభలో నినాదాలతో హోరెత్తించారు. “జై తెలంగాణ” రాష్ట్రాభివృద్ధికి శ్రమించిన ప్రాజెక్టుపై విచారణ ఏంటి?” అంటూ ప్రశ్నలు సంధించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పత్రాలను చించి, చైర్మన్ పోడియం వైపు విసిరారు. రాహుల్ గాంధీకి సీబీఐ వద్దు, రేవంత్ కు సీబీఐ ముద్దు అంటూ నినాదాలు చేశారు. “బడేభాయ్… చోటేభాయ్… ఏక్ హై”, “కాళేశ్వరం రిపోర్ట్ ఫేక్ హై అంటూ బీఆర్ఎస్ సభ్యులు సభలో గందరగోళాన్ని పెంచారు.
Read Also: BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్‌ఎస్ నేతలే : బండి సంజయ్
ఈ హంగామా మధ్య పలు కీలక బిల్లులు, ముఖ్యంగా పురపాలక, పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లులు చట్టంగా మారిన తరువాత మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకావొచ్చు. ఇది బీసీ సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే అవకాశాన్ని కల్పించనుంది. సభలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో చివరికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు. సభ ముగిసిన తరువాత కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తమ నిరసనను కొనసాగించారు. గన్‌పార్క్ వద్ద నల్లకండువాలు ధరించి వారు నిరసన చేపట్టారు. రైతులకు నీరు అందించేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ తగదు ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి మేలు చేసింది. దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయకూడదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుపై వచ్చిన కమిషన్ నివేదికను బీఆర్ఎస్ పూర్తిగా ఖండించింది. సీబీఐ విచారణ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తూ, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇదే సందర్భంలో రాష్ట్రానికి మేలు చేసిన పాలకులను తప్పుడు ఆరోపణలతో ముద్ర వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, ఒకవైపు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే చట్టాలు ఆమోదం పొందగా, మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరం కేసు కీలక మలుపు తీసుకున్న విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాబోయే రోజుల్లో శాసనమండలి మరియు రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశాలు మరింత చర్చనీయాంశాలుగా మారే అవకాశం ఉంది.
Read Also: KTR : ఇప్పుడు మీ సీఎం ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా.?