Miss World Issue : తెలంగాణ ఇమేజ్ డ్యామేజ్ ..?
Miss World Issue : ఈ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా ప్రాచుర్యం ఇవ్వడం ద్వారా తెలంగాణను లక్ష్యంగా తీసుకుని విమర్శలు చేస్తున్నారు
- By Sudheer Published Date - 05:42 PM, Mon - 26 May 25

హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు (Miss World 2025) అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్నాయి. ఈ పోటీల్లో పాల్గొన్న మిస్ (Miss Millie) ఇంగ్లాండ్ అనారోగ్య కారణాలతో పోటీ మధ్యలోనే తప్పుకుని లండన్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను ఒక వేశ్యలా చూసారని ఆమె చెప్పడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వేయించిన ఏర్పాట్లు, ఆతిథ్యం పై వివిధ వర్గాల్లో విమర్శలు మొదలయ్యాయి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠకే మచ్చ లా మారే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
Pawan Warning : నిన్న అల్లు అరవింద్ ..నేడు దిల్ రాజు..అసలు లెక్కలు బయటకొస్తున్నాయి
అయితే ఈ పోటీల్లో వందల మంది బ్యూటీ క్వీన్లు పాల్గొన్నారు. వారిలో చాలా మంది తెలంగాణ ప్రభుత్వ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తున్నారు. పర్యాటక ప్రదేశాల సందర్శన, సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మిస్ ఇంగ్లాండ్ మాత్రం పోటీల్లో పాల్గొన్న సమయంలో ఎక్కడా అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. వెళ్లేటప్పుడు కూడా ఆనందంగా వెళ్లినట్టు కనిపించింది. కానీ లండన్ వెళ్లిన తరువాత ఆమె చేసిన ఆరోపణలు నిర్వాహకులకే కాక, చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఒకరి అనుభవాన్ని తీసుకుని మొత్తం పోటీ వ్యవస్థను, ఆతిథ్యాన్ని విమర్శించడం సమంజసం కాదు.
ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఈ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా ప్రాచుర్యం ఇవ్వడం ద్వారా తెలంగాణను లక్ష్యంగా తీసుకుని విమర్శలు చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రతిష్ఠకు ముప్పుగా మారవచ్చని పర్యవేక్షకులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పోటీలను అంతర్జాతీయ ప్రచారం కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేసినా, ఈ ఆరోపణలు అణిచివేయలేని మరకలాగా మిగిలే ప్రమాదం ఉంది. అందుకే నిశితంగా విచారణ జరిపి, వాస్తవాలను బహిర్గతం చేయడం ఎంతో అవసరం.