Harish Rao: తలసేమియా రహిత రాష్ట్రంగా మారుస్తాం!
తెలంగాణను తలసేమియా రహిత రాష్ట్రంగా మారుస్తామని స్టేట్ హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు అన్నారు.
- Author : Balu J
Date : 30-04-2022 - 3:01 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణను తలసేమియా రహిత రాష్ట్రంగా మారుస్తామని స్టేట్ హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు అన్నారు. తలసేమియా, ఇతర ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం రెడ్ క్రాస్ సోసైటీ, కమలా సోసైటీ నిర్వహించిన సమావేశానికి మంత్రి హరీశ్ రావు హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉస్మానియా, నీలఫర్, గాంధీ ఆసుపత్రుల్లో తలసేమియా రోగులకు చికిత్స అందిస్తుందని ఆయన అన్నారు. తలసేమియా బారిన పడిన చిన్నారులను చూస్తే తనకెంతో బాధ కలుగుతుందని, జన్యుపరమైన కారణాల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదని ఆయన అన్నారు. వ్యాధి నివారణకుగానూ బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో ఈ వ్యాధి ఉందని హరీశ్ రావు గుర్తు చేశారు.
మాతా శిశుమరణాల విషయంలో తెలంగాణ రాష్ట్రం తమిళనాడును వెనక్కు నెట్టి దేశంలో మూడో స్థానంలో నిలిచింది అని, నెంబర్ వన్ గా నిలవడానికి కృషి చేస్తున్నామని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు తలసేమియా వ్యాధి నివారణకు ఫోకస్ చేయాలని, ఈ విషయంలో దేశంలో తొలి రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా విద్యుత్ కోతలేనని, రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ ప్రతీ రంగానికి వ్యవసాయం, పరిశ్రమలు, గృహ అవసరాలకు కోతలులేకుండా అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.