Google Hyderabad : హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్.. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
హైదరాబాద్‌లో GSEC సెంటర్(Google Hyderabad)ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావడం అనేది సంతోషకరమైన విషయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
- By Pasha Published Date - 04:52 PM, Wed - 4 December 24

Google Hyderabad : గూగుల్ కంపెనీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ ముందుకొచ్చింది. ఇది గూగుల్ ఏర్పాటు చేయబోతున్న ఐదో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. ఏషియా పసిఫిక్ జోన్‌లో టోక్యో తర్వాత గూగుల్ ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ ఇదే. హైదరాబాద్‌లో GSEC సెంటర్(Google Hyderabad)ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావడం అనేది సంతోషకరమైన విషయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో మరోసారి ప్రపంచంలో మేటి ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా అందరి దృష్టిని హైదరాబాద్ ఆకర్షించిందని ఆయన పేర్కొన్నారు.
Also Read :Formula E race Case : ఐఏఎస్ అర్వింద్ కుమార్‌పై అవినీతి కేసు నమోదుకు సీఎం రేవంత్ అనుమతి
చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఓ) రాయల్ హాన్సెన్ ఆధ్వర్యంలోని గూగుల్ కంపెనీ ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ‘‘డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ, ఐటీ ఇంజినీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. ఇప్పటికే ప్రపంచంలో పేరొందిన అయిదు టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ ఇక్కడే ఉన్నాయి’’ అని రాయల్ హాన్సెన్ పేర్కొన్నారు.
Also Read :Railway Tickets : రూ.100 రైల్వే టికెట్‌లో రూ.46 మేమే భరిస్తున్నాం : రైల్వే మంత్రి
ఈ సెంటర్ ఏర్పాటుతో వేల సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. భారత్‌లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలను పెంచేందుకు ఈ సెంటర్ పని చేస్తుందని చెప్పారు. వాస్తవానికి ఈ ఏడాది అక్టోబరు 3వ తేదీన జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2024 కాన్‌క్లేవ్‌లోనే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు విషయాన్ని గూగుల్ ప్రకటించింది. అప్పటి నుంచి జీఎస్ఈసీని సాధించేందుకు దేశంలోని చాలా రాష్ట్రాలు పోటీపడ్డాయి. అయితే చివరకు ఆ ప్రాజెక్టు సీఎం రేవంత్ చొరవతో హైదరాబాద్‌కు దక్కింది.