Govt Employees – New Scheme : ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక హెల్త్ కేర్ ట్రస్టు.. వివరాలివీ..
Govt Employees - New Scheme : అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరో స్కీమ్ ను ప్రకటించింది.
- Author : Pasha
Date : 09-10-2023 - 11:16 IST
Published By : Hashtagu Telugu Desk
Govt Employees – New Scheme : అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరో స్కీమ్ ను ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తరహాలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ప్రత్యేకంగా హెల్త్ కేర్ ట్రస్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సర్వీసులో ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు పింఛను పొందుతున్న వారు, వారి కుటుంబ సభ్యులు కూడా నగదు రహిత, నాణ్యమైన వైద్య సౌకర్యాన్ని పొందడానికి ఈ ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు ఆదివారం ఒక జీవోను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో మొత్తం 17 మంది సభ్యులుంటారు. ఈ ట్రస్టులో ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, విద్య, సాధారణ పరిపాలన (జీఏడీ) శాఖ కార్యదర్శులు, హోంశాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ సభ్యులుగా ఉంటారు. ట్రస్టులో ప్రభుత్వం తరఫున ఓ అధికారి సీఈఓగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల తరఫున ఆరుగురు, పింఛనుదారుల తరపున ఇద్దరిని ప్రభుత్వం ఇందులో సభ్యులుగా నామినేట్ చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join
మూల వేతనంలో ప్రతి నెలా 1 శాతం..
ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ప్రతి నెలా 1% మేర (మూల వేతనంలో) ఆటోమేటిక్‌గా కంట్రిబ్యూషన్ పేరుతో ట్రస్టుకు వెళ్తుంది. ప్రభుత్వం కూడా ఇంతే మొత్తంలో మ్యాచింగ్ గ్రాంట్‌ను జమ చేస్తుంది. ఉద్యోగులు, పింఛనుదారులు వారి వంతుగా కొంత మొత్తాన్ని ఈ ట్రస్టుకు అందిస్తే ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంటును కలిపి వారికి ఈ సౌకర్యాన్ని కల్పించనుంది. ప్రస్తుతం తెలంగాణలో ఎంప్లాయీస్ హెల్త్ సర్వీసెస్ పాలసీ ఉన్నప్పటికీ.. ఇక నుంచి ప్రత్యేకంగా ట్రస్టు ద్వారా వైద్య సేవలు అందనున్నాయి.
Also read : World Cup 2023: కోహ్లీ రాహుల్ బ్యాటింగ్ పై అనుష్క రియాక్షన్
ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అదనంగా 15 పోస్టులు..
వాస్తవానికి దీనిపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గతంలోనే రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు సమర్పించారు. తమ వంతు కంట్రిబ్యూషన్‌గా ప్రతినెలా ‘బేసిక్ పే’లో 1 శాతాన్ని అందిస్తామని, హెల్త్ కేర్ ట్రస్టును ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఇటీవల వైద్యరోగ్య మంత్రి హరీశ్‌రావు భేటీ అయి.. హెల్త్ కేర్ ట్రస్టును ఎలా అమలు చేయాలనే దానిపై డిస్కస్ చేశారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ తోనూ సంప్రదింపులు జరిపారు. ఈక్రమంలోనే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఆదివారం జీవో విడుదల చేశారు. ఈ ట్రస్టు పనిచేయడానికి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అదనంగా 15 పోస్టులను (Govt Employees – New Scheme) మంజూరు చేస్తున్నట్లు ఈ జీవోలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.