Job Calendar : 20 వేల పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్
Job Calendar : ప్రస్తుతం పోలీస్, వైద్య, గురుకుల, విద్యుత్ వంటి విభాగాల్లో గణనీయమైన ఖాళీలు ఉన్నాయి. ప్రత్యేకంగా పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయిలో సుమారు 12,452 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో సివిల్ విభాగంలోనే 8,442 ఖాళీలు ఉన్నట్లు సమాచారం
- By Sudheer Published Date - 12:05 PM, Sat - 4 October 25

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ దిశగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే సుమారు 60,000 పైగా నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, మిగిలిన విభాగాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షల ఫలితాలు వెలువడడంతో పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలు వేగవంతం అయ్యాయి. తాజాగా 20,000 పోస్టులకు ఆర్థికశాఖ నుంచి అనుమతి రావడంతో, ఇకపై వరుసగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. దీనితో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు విస్తృతమైన అవకాశాలు లభించనున్నాయి.
Cough: విపరీతమైన దగ్గు సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
ప్రభుత్వం పలు శాఖల్లో ఖాళీల భర్తీకి కసరత్తు చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ పూర్తికావడంతో కొత్త రోస్టర్ ప్రకారం ఉద్యోగాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. టీజీపీఎస్సీ, గురుకుల నియామక బోర్డు, పోలీస్ నియామక బోర్డు వంటి ప్రధాన సంస్థలు సంబంధిత విభాగాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించడం ప్రారంభించాయి. ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం కేటగిరీలవారీగా పోస్టులు గుర్తించి, ఆర్థికశాఖ అనుమతులు పొందేందుకు చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల గుర్తింపు, సర్దుబాటు వంటి అంశాలపై ప్రత్యేక కమిటీ పరిశీలన చేస్తోంది.
ప్రస్తుతం పోలీస్, వైద్య, గురుకుల, విద్యుత్ వంటి విభాగాల్లో గణనీయమైన ఖాళీలు ఉన్నాయి. ప్రత్యేకంగా పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయిలో సుమారు 12,452 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో సివిల్ విభాగంలోనే 8,442 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. గురుకుల నియామక బోర్డు పరిధిలో దాదాపు 2,000 పైగా పోస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో గ్రూప్–4లో కూడా కొంతమంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యుత్ సంస్థల్లోని ఇంజినీరింగ్ విభాగాల్లో 2,000 నుంచి 3,000 వరకు పోస్టులు ఉండటంతో, ఈ నియామకాలు త్వరలోనే అధికారిక ప్రకటనల రూపంలో రావచ్చని అంచనా. ఈ నియామకాలు ప్రారంభం అవ్వడం వల్ల రాష్ట్రంలోని నిరుద్యోగులకు బంగారు అవకాశాల విందు అందనుంది.