Telangana Floods : తెలంగాణలో వరద ఆందోళన.. ప్రాజెక్టులు పోటెత్తి గేట్లు ఎత్తిన అధికారులు
Telangana Floods : తెలంగాణలో వర్షాలు విస్తృతంగా కురుస్తూ వరద పరిస్థితులు తీవ్రతరమవుతున్నాయి. అనేక జిల్లాల్లో వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో ప్రాజెక్టులు పోటెత్తి గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
- By Kavya Krishna Published Date - 10:29 AM, Tue - 19 August 25

Telangana Floods : తెలంగాణలో వర్షాలు విస్తృతంగా కురుస్తూ వరద పరిస్థితులు తీవ్రతరమవుతున్నాయి. అనేక జిల్లాల్లో వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో ప్రాజెక్టులు పోటెత్తి గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదులు, వాగులు పొంగిపొర్లుతుండటంతో రహదారులు దెబ్బతిని రవాణా అంతరాయం ఏర్పడింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా పలువురు జిల్లా కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఒక రోజు సెలవు ప్రకటించారు. అలాగే సిద్దిపేట జిల్లా కలెక్టర్ కూడా వరదల హెచ్చరికల నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతుండగా, కడెం ప్రాజెక్టులో రెండు గేట్లు, స్వర్ణ ప్రాజెక్టులో ఒక గేటు ఎత్తి వరద నీటిని విడుదల చేస్తున్నారు. జైనథ్ మండలంలో 116.5 మిల్లీమీటర్లు, కొమురం భీం జిల్లా వాంకిడి మండలంలో 113 మిల్లీమీటర్లు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాంతంలో 57 మిల్లీమీటర్లు, నిర్మల్ జిల్లాలోని కుంటాలలో 29.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. అధికారులు 31 క్రెస్ట్ గేట్లు ఎత్తి, 2.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోకి ఎదుర్కొంటూ, 2.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోనూ వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. 3.70 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, అధికారులు 26 గేట్లు ఎత్తి 3.98 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి మట్టం 585.20 అడుగులు, నిల్వ 298.13 టీఎంసీలుగా ఉంది. మూసీ ప్రాజెక్టులో కూడా ఎనిమిది గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి వరద నీటిని కిందకు వదులుతున్నారు.
Food Poisoning : సినిమా సెట్లో ఫుడ్ పాయిజన్.. 120 మందికి అస్వస్థత
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లో వరద ఉధృతి అత్యంత తీవ్రంగా ఉంది. మొత్తం 85 గేట్లను ఎత్తి అధికారులు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5,79,860 క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 35 గేట్లు ఎత్తి 3.26 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కడెం, ఎస్సారెస్పీ నుంచి కూడా వరదనీరు భారీగా చేరుతుండడంతో ప్రాజెక్టుల నిల్వలు వేగంగా నిండిపోతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో నీటి మట్టం 694.27 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి వరదనీటిని విడుదల చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోనూ వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదు గేట్లు ఎత్తి 39,009 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 43,466 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదు చేస్తున్నారు. సింగూరు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. అయితే సింగూరు నుంచి మంజీరా నదిలోకి పెద్ద ఎత్తున నీరు వదులుతుండటంతో ఏడు రోజులుగా ఏడు పాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయ గర్భగుడి వరకూ వరద నీరు ప్రవేశించడం అక్కడి భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులో కూడా వరద కొనసాగుతోంది. ఎస్సారెస్పీ నుంచి 11 వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లి నుంచి 3,150 క్యూసెక్కులు, మూలవాగు నుంచి 1,516 క్యూసెక్కులు చేరుతుండటంతో ప్రాజెక్టులో నిల్వ 13.306 టీఎంసీలకు చేరింది.
తెలంగాణ అంతటా కొనసాగుతున్న వర్షాలు, వరదల దృష్ట్యా అధికారులు నిరంతర అప్రమత్తతతో ఉన్నారు. జలాశయాల నుంచి నీటి విడుదల నియంత్రణలో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. పలు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే పరిస్థితులు కొనసాగుతున్న విధానాన్ని బట్టి ఇంకా కొన్ని రోజులు వర్షాలు, వరదల ఇబ్బందులు తప్పవని అధికారులు అంచనా వేస్తున్నారు.
MLC Vijayashanti: ఓట్ల చోరీపై ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు!