Telangana Debts : తెలంగాణ అప్పు.. నాడు రూ.72,658 కోట్లు.. నేడు రూ.6,71,757 కోట్లు
Telangana Debts : 2014-15 నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.72,658 కోట్లు.. తొమ్మిదిన్నర ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అప్పు రూ. 6,71,757 కోట్లు..
- By Pasha Published Date - 01:22 PM, Wed - 20 December 23

Telangana Debts : 2014-15 నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.72,658 కోట్లు..
తొమ్మిదిన్నర ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అప్పు రూ. 6,71,757 కోట్లు..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో రిలీజ్ చేసిన శ్వేతపత్రంతో తెలంగాణ రాష్ట్ర అప్పులకు సంబంధించిన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం.. 2014-15 నాటికి రాష్ట్ర రుణం 72,658 కోట్లు మాత్రమే. ప్రస్తుతం అది రూ. 6,71,757 కోట్లుగా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో తెలంగాణ అప్పు సగటున 24.5 శాతం మేర పెరిగింది. 2023-24 అంచనాల ప్రకారం.. రాష్ట్రం అప్పులు 3,89,673 కోట్లుగా ఉంటాయని శ్వేతపత్రంలో ప్రస్తావించారు. ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి రాష్ట్ర సర్కారు తీసుకున్న అప్పులు రూ.59,414 కోట్లు అని తెలిపారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేదని.. ప్రస్తుతం పది రోజులకు తగ్గిపోయిందని శ్వేతపత్రంలో ప్రస్తావించారు. దీంతో రోజువారీ ఖర్చుల కోసం కూడా రిజర్వు బ్యాంకుపై తెలంగాణ సర్కారు ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు.
శ్వేతపత్రంలోని కీలక వివరాలివీ..
- 2014 సంవత్సరంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, 2023 నాటికి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వైట్ పేపర్ తెలిపింది. బడ్జెటేతర రుణాల వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకుందని వివరించింది.
- రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణభారం పది రెట్లు పెరిగిందని వెల్లడించింది.
- బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర బడ్జెట్ కు, వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉందని పేర్కొన్నారు.
- రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ రాబడిలో 34 శాతాన్ని రుణాల చెల్లింపునకు, 35 శాతాన్ని ఉద్యోగుల జీతభత్యాలకు, పెన్షన్ల చెల్లింపునకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది.
- గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదని కాంగ్రెస్ సర్కారు శ్వేతపత్రం కుండబద్దలు కొట్టింది.
- 2015-16 ఆర్థిక సంవత్సరంలో రుణపరమైన జీఎస్డీపీ దేశంలోనే అత్యల్పంగా తెలంగాణలో 15.7 శాతం ఉండేదని.. అది కాస్తా 2023-24 కల్లా 27.8 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన నిర్వాకం వల్ల రోజువారీ ఖర్చుల కోసం కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు. పదేళ్లలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆర్థిక అరాచకత్వాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన చెప్పారు. ఇక తాము 6 గ్యారంటీలను అమలు చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నామని, అందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం(Telangana Debts) విడుదల చేశామని భట్టి వెల్లడించారు. కాగ్ రిపోర్ట్‌లోని అంశాలను కూడా శ్వేతపత్రంలో పొందుపరిచామని తెలిపారు. 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయడంతో.. శాసనసభలో హాట్ హాట్ గా చర్చ జరగనుంది.