Revanth Reddy : రైతు సమస్యలపై పోరుకు సిద్ధమైన రేవంత్
తెలంగాణలోని రైతుల సమస్యలపై విడతలవారీ ఉద్యమానికి కాంగ్రెస్ సిద్ధం అయింది.
- Author : Hashtag U
Date : 21-11-2022 - 4:39 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలోని రైతుల సమస్యలపై విడతలవారీ ఉద్యమానికి కాంగ్రెస్ సిద్ధం అయింది. ఆ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షెడ్యూల్ ను ప్రకటించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చౌక్ వద్ద నిరసన తెలపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రైతు సమస్యలపై దశలవారీగా నిరసనలు చేపట్టాలని పార్టీ యోచిస్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో టీపీసీసీ చీఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. తెలంగాణలో ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేలా ఆలోచించాలని కోరింది. పోడు భూముల సమస్యపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు, ధరణి పోర్టల్, పోడు భూముల సమస్యలతో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. రైతు సమస్యలపై గవర్నర్ ను కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలుస్తుందని ప్రకటించారు.