Revanth Reddy: రేవంత్ రెడ్డి ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు? ఆ 25 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరు?
- By HashtagU Desk Published Date - 11:22 AM, Sat - 19 March 22

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయంటూ ప్రచారం హోరెత్తుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం నిమ్మళంగా ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో పోరాటాలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఎందుకు దానిని అమలు చేయలేకపోతున్నారు? ఎందుకంటే.. రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్ ఛార్జ్ లే లేరు. మరి దీనికి గాంధీభవన్ ఏం సమాధానం చెబుతుంది?
పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోకుండా.. కేవలం ప్రభుత్వ వ్యతిరేకతపైనే గెలిచేస్తామని నమ్ముకుంటే సరికాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అందరూ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. ఆయన ఆర్థిక లావాదేవీలు, ఏకస్వామ్య ధోరణి, లెక్కలేనితనం గురించి అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పీసీసీ చీఫ్ ఎందుకు పార్టీపై ఫోకస్ పెట్టడం లేదు?
దాదాపు 10 చోట్ల పార్టీకి ఇన్ ఛార్జ్ లు ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఏమైనా అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను డిసైడ్ చేసేస్తామని తెలంగాణ కాంగ్రెస్ చెబుతుంది. మరి.. నియోజకవర్గాల్లో పార్టీకి బాధ్యులెవరో కూడా చెప్పలేని పార్టీ.. ముందే అభ్యర్థులను ఎలా నిర్ణయించగలుగుతుంది? ఇలా అయితే ఎన్నికల్లో గెలుపు మాట అటుంచి.. కనీసం రెండోస్థానం కూడా దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంటుంది.
ఖమ్మంలో మధిర, భద్రాచలం, ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, పాలేరు నియోజకవర్గాల పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. ఇక్కడ పార్టీకి ఇన్ ఛార్జ్ లు ఎవరో కూడా కార్యకర్తలకే తెలియడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, ఆలేరు… ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని కొల్లాపూర్, మక్తల్ లో పార్టీలో ఉన్నవారు టీఆర్ఎస్ లోకి వెళ్లగా.. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నవారికి మాత్రం బాధ్యతలు ఇవ్వడం లేదు.
వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, మహబూబాబాద్ సీట్ల పరిస్థితి ఏమిటో పార్టీ వర్గాలకే అర్థం కావట్లేదు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి పాల్వాయి, నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో, సిరిసిల్లలో ఇదే దుస్థితి. రంగారెడ్డి జిల్లా పరిధిలోనికి వచ్చే చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లికి కూడా ఇన్ ఛార్జ్ ను పెట్టుకోలేని దుస్థితిలో పార్టీ ఉందా? హైదరాబాద్ లో గోషామహల్, ముషీరాబాద్, సికింద్రాబాద్ సంగతిని చూసినా ఇంతే. పార్టీ పరిస్థితి ఇన్ని ప్రాంతాల్లో ఇంత దయనీయంగా ఉంటే అధిష్టానం ఏం చేస్తోందని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.