Telangana Cabinet Meeting : రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం
Telangana Cabinet Meeting : ఇక మేడిగడ్డ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు, సమ్మక్క-సారలమ్మ ఆనకట్ట నిర్మాణం, తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్ట్ ప్రణాళిక వంటి కీలక సేద్యా ప్రాజెక్టులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది
- By Sudheer Published Date - 08:45 AM, Wed - 15 October 25

తెలంగాణలో రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యంగా జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా, ఇటీవల హైకోర్టు స్టే కారణంగా ఆగిపోయిన BC రిజర్వేషన్లు మరియు స్థానిక సంస్థల ఎన్నికల అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ రెండు అంశాలపై సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్న అఫిడవిట్ రూపకల్పనపై కూడా కేబినెట్ ఆమోదం ఇవ్వనుందని సమాచారం.
అదే విధంగా, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్ట్, మూసీ నది పునరుద్ధరణ ప్రణాళిక, టీ-ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణ, ధాన్యం సేకరణ విధానం వంటి పలు ప్రజా ప్రయోజన అంశాలు కూడా చర్చకు వస్తాయి. ముఖ్యంగా రైతులకు సమయానికి చెల్లింపులు జరిగేలా చర్యలు, గోదాముల్లో నిల్వ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ రూపకల్పన, పరిశ్రమల పెట్టుబడుల ప్రోత్సాహక చర్యలు కూడా కేబినెట్ అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది. నగరాభివృద్ధి ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రేవంత్ సర్కార్ కొత్త మాస్టర్ ప్లాన్ దిశగా అడుగులు వేయనుంది.
ఇక మేడిగడ్డ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు, సమ్మక్క-సారలమ్మ ఆనకట్ట నిర్మాణం, తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్ట్ ప్రణాళిక వంటి కీలక సేద్యా ప్రాజెక్టులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రంలో జలవనరుల వినియోగంపై కేంద్రం నుంచి వచ్చిన సూచనలను, నిధుల కేటాయింపులను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రతిపాదనలు రూపొందించే అవకాశముంది. రేవంత్ సర్కార్ అభివృద్ధి ప్రాజెక్టులకు వేగం ఇవ్వడమే కాకుండా, ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన అంశాల అమలు వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఈ కేబినెట్ భేటీ జరగనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.