MLAs Disqualification Petition : మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ?.. స్పీకర్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం !
గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రోహత్గి గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి... మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా ? అంటూ తెలంగాణ స్పీకర్‌ను సుప్రీం ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.
- By Latha Suma Published Date - 01:30 PM, Fri - 31 January 25

MLAs Disqualification Petition : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని గతేడాది మార్చిలో చెప్పినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపారు.
అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మాట్లాడుతూ..ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని కోర్టుకు చెప్పారు. నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రోహత్గి గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి… మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా ? అంటూ తెలంగాణ స్పీకర్‌ను సుప్రీం ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. స్పీకర్‌ను అడిగి నిర్ణయం చెపుతామని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఎంత సమయం కావాలో మీరే స్పీకర్‌ను కనుక్కొని చెప్పాలని రోహత్గికి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
కాగా, పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ కనీసం నోటీసు ఇవ్వలేదని పిటిషన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఇక, సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావుపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద ఈ పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి కడియం, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావు సహా పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీనిపై జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తెల్లం, కడియం, దానంపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Bhoomi Puja For Osmania Hospital : ఉస్మానియా కొత్త హాస్పటల్ కు భూమి పూజ చేసిన సీఎం రేవంత్