HCA : హెచ్‌సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టు షాక్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారంలో అజహరుద్దీన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అసోసియేషన్ ఎన్నికల్లో
- Author : Prasad
Date : 10-10-2023 - 11:02 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారంలో అజహరుద్దీన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అసోసియేషన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును అజహరుద్దీన్ ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హెచ్‌సీఏలో అంబుడ్స్‌మెన్, ఎథిక్స్ అధికారి నియామకంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడంతో.. సింగిల్ మెంబర్ కమిటి ఏర్పాటు చేస్తూ.. 2022 ఆగస్టులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావును సింగిల్ మెంబర్ కమిటీగా సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. ఈనెల 20న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హెచ్‌సిఎ సభ్యులు, అసోసియేటెడ్ కమిటీలపై ఈ కమిటీ కీలక నిర్ణయం తీసుకోనుంది. హెచ్‌సీఏ ఎన్నికల్లో అజహరుద్దీన్‌పై అనర్హత విధిస్తూ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు కమిటీ ఆదేశాలు ఇచ్చింది. ఈ కమిటీ ఉత్తర్వులపై అజహరుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ మొదలైందని, ఈ దశలో డిబార్ చేయడం సబబు కాదని, తనకు అర్హత కల్పించాలని సుప్రీంకోర్టుకు అజారుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత దశలో తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియా ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా వేసింది.
Also Read: Chandrababu : చంద్రబాబు కు స్వల్ప అస్వస్థత.. డీహైడ్రేషన్ తో ఇబ్బందిపడుతున్న చంద్రబాబు.