TGSRTC : ఆర్టీసీలో సమ్మె సైరన్..డిమాండ్స్ ఇవే..!!
TGSRTC : ఆర్టీసీ ఎండీతో సమావేశమైన ఉద్యోగులు 21 డిమాండ్లతో నోటీసులు ఇచ్చారు
- By Sudheer Published Date - 07:33 PM, Mon - 27 January 25

తెలంగాణ ఆర్టీసీ (TSRTC) జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించారు ఉద్యోగులు. ఆర్టీసీ ఎండీతో సమావేశమైన ఉద్యోగులు 21 డిమాండ్లతో నోటీసులు ఇచ్చారు. వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాటిని పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి, సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 9 నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. కార్మికుల సంక్షేమానికి, సంస్థ అభివృద్ధికి అవసరమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని కార్మిక సంఘాలు వెల్లడించాయి.
Chandrababu : చంద్రబాబు పై కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రశంసలు
కార్మికుల ప్రధాన డిమాండ్లు చూస్తే..
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2017 వేతన సవరణ బకాయిలను చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వేతన సవరణ అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త బస్సుల కొనుగోలు ద్వారా ఆర్టీసీ సేవలను ఆధునీకరించడమే కాకుండా, విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి సంస్థకు అందించాలని వారు కోరుతున్నారు.
ఆర్టీసీ సంస్థ అప్పులను ప్రభుత్వమే టేకోవర్ చేయాలని, సంస్థ అభివృద్ధి కోసం ప్రతి ఏడాది బడ్జెట్‌లో 3% కేటాయించాలని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించి, తార్నాక హాస్పిటల్‌లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని కార్మికులు డిమాండ్ చేశారు.
కార్మికులకు 8 గంటల పని దినాలు అమలు చేయాలని, మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటలలోపు డ్యూటీ పూర్తయ్యేలా షిఫ్టులు ఉండాలని కోరారు. 21 రోజుల హాజర్‌తో ఇన్సెంటివ్ ఇవ్వడంతో పాటు, ప్రతి యూనిట్‌లో సౌకర్యాలను మెరుగుపరచాలని తెలిపారు. డ్రైవర్, కండక్టర్, మెయింటినెన్స్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల పరిష్కారం చేయకపోతే ఫిబ్రవరి 9 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో సమ్మె ప్రారంభమవుతుందని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ సమాధానం లేకుండా ఉంటే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించి, సమ్మెను నివారించాలని ఉద్యోగులు కోరుతున్నారు.