Chandrababu : చంద్రబాబు పై కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రశంసలు
Chandrababu : బీసీల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ వేసిన పునాదులను చంద్రబాబు మరింత పటిష్టం చేశారని కొనియాడారు
- By Sudheer Published Date - 06:28 PM, Mon - 27 January 25

బీసీ సంక్షేమానికి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన కృషిని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) అభినందించారు. సోమవారం గుంటూరులో పర్యటించిన ఆయన.. బీసీల అభివృద్ధి (Development of BC) కోసం ఎన్టీఆర్ (NTR) వేసిన పునాదులను చంద్రబాబు మరింత పటిష్టం చేశారని కొనియాడారు. బీసీలకు పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయికి ఎదిగే అవకాశం టీడీపీ ప్రభుత్వంలోనే లభించిందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గత వైసీపీ హయాంలో ఏ మంత్రులకు సరైన అధికారం లేదని రామ్మోహన్ విమర్శించారు. పార్లమెంటులో తనను అవమానించేలా వైసీపీ సభ్యులు మాట్లాడిన దుస్థితిని ఆయన వెల్లడించారు. కానీ బీసీల ధైర్యాన్ని ప్రోత్సహించి, ప్రజలకు తన శక్తి మేరకు సేవలందిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు తనపై చూపించిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ బీసీ సంక్షేమానికి తాను మరింతగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా బీసీ విద్యార్థులకు చదువులో అవకాశాలను అందించిన ఘనత చంద్రబాబుదేనని , టీడీపీ హయాంలో బీసీ విద్యార్థులు నేడు వైద్యులుగా, ఇంజనీర్లుగా దేశవిదేశాల్లో స్థిరపడగలుగుతున్నారన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్లనే సమాజంలో బీసీల స్థాయి మారిందని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలు ఐకమత్యంతో ఉంటేనే తమ సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. బీసీ నాయకత్వానికి ఎన్టీఆర్ వేసిన పునాదులను చంద్రబాబు భవిష్యత్తు తరాల కోసం మరింత ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. బీసీలంతా చంద్రబాబుకు అండగా నిలవడం వల్లే టీడీపీ అభ్యర్థులు రికార్డు స్థాయిలో మెజార్టీలు సాధించారని ఆయన అభిప్రాయపడ్డారు.
బీసీ సంక్షేమం పట్ల చంద్రబాబుకు ఉన్న ప్రేమకు తానే నిదర్శనమని రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రం, దేశం మాత్రమే కాకుండా, ప్రపంచాన్ని ఏలే స్థాయికి బీసీలను తీసుకెళ్లడం టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.