Center Of Excellence: సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించండి.. సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి సూచన!
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి అభినందించారు. జాతీయ నైపుణ్య శిక్షణ కింద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
- Author : Gopichand
Date : 15-06-2025 - 8:21 IST
Published By : Hashtagu Telugu Desk
Center Of Excellence: తెలంగాణ రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను (Center Of Excellence) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఆదివారం సమావేశమయ్యారు. ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తాము ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసి.. దానిని ఐటీఐలను అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలియజేశారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి అభినందించారు. జాతీయ నైపుణ్య శిక్షణ కింద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఐటీఐలన్నింటికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని కేంద్ర మంత్రి సీఎంను కోరారు. ఐటీఐల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం వెంటనే అధికారులను ఆదేశించారు. ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లు కాలానుగుణంగా ఐటీఐల్లో సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని.. ఇందుకోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Also Read: NEET UG result 2025: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్.. జులై నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ!
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, సీఎంవో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈవో జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి, కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.