ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్రోవు, ఎమ్మెల్సీ నవీన్రావు తండ్రి కొండల్రావుకు సిట్ నోటీసులు జారీచేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణకు
- Author : Sudheer
Date : 07-01-2026 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
- ఫొన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం
- కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడికి నోటీసులు
- ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుకు నోటీసు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి సిట్ (SIT) అధికారులు తమ దర్యాప్తును వేగవంతం చేస్తూ ప్రముఖ రాజకీయ నేతల కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో తాజాగా కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు, అలాగే ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలోనే ఎమ్మెల్సీ నవీన్ రావును సుదీర్ఘంగా విచారించిన అధికారులు, తాజాగా ఆయన తండ్రిని కూడా పిలవడం గమనార్హం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసులో వీరి పాత్ర ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని వీరు ఏమైనా వినియోగించుకున్నారా లేదా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ కేసు కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాకుండా, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టై జైలులో ఉండగా, దర్యాప్తులో భాగంగా లభించిన డిజిటల్ డేటా ఆధారంగా సిట్ అధికారులు ముందుకు వెళ్తున్నారు. పట్టుబడిన హార్డ్ డిస్క్‌లు, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఎవరెవరితో సంభాషణలు జరిగాయి? ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరికి చేరవేశారు? అనే విషయాలపై స్పష్టత కోసమే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ కేసు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ అవసరాల కోసం వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారనే కోణంలో ప్రభుత్వం పకడ్బందీగా విచారణ జరిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల కుటుంబ సభ్యులకు నోటీసులు అందడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఈ కేసు మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి అరెస్టులు లేదా ఇతర చర్యలు ఉండవచ్చని సమాచారం.