KTR: డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ ను శిక్షించాలా? వద్దా? : కేటీఆర్
- By Balu J Published Date - 07:03 PM, Sun - 19 May 24

KTR: వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు లో జరిగిన సన్నాహాక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ కార్యక్రమాలు చేసినా మనం పట్టించుకోలేదు. ప్రభుత్వం లో ఉండి ఐదునెలల్లో రేవంత్ రెడ్డి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అయినప్పటికీ సిగ్గు లేకుండా హామీలు అమలు చేశామంటూ రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసిన వ్యక్తిని శిక్షించాలా? వద్దా? రైతులు బిడ్డలు ఆలోచించాలె. రైతులు నాట్లు వేసే నాడు కాకుండా రైతులు ఓట్లు వేసే నాడు రైతుబంధు వేస్తున్నారు. ఇప్పటికీ కూడా రైతుల ధాన్యం కొంటలేరు. రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఐదు నెలల్లోనే రాష్ట్ర రైతాంగం మొత్తం ఆగమాగమయ్యే పరిస్థితి తెచ్చారు’’ అని కేటీఆర్ అన్నారు.
‘‘రైతు కూలీలు, కౌలు రైతులు, ఆటో డ్రైవర్లు ఇలా అన్ని వర్గాలకు సాయం చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి కారణంగా 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయి. వాళ్ల సమస్యలను ప్రశ్నించే వాళ్లు ఉండాలా? లేదంటే బ్లాక్ మెయిల్ దందాలు చేసేటోళ్లు ఉండాలా? రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గల్లా పట్టి నిలదీసేందుకు రాకేష్ రెడ్డికి అవకాశం ఇవ్వాలె. ఆలేరు లో మనం మంచి పనులు చేసినప్పటికీ స్వల్ప తేడాతో ఓడిపోయాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వనంత ఎక్కువ జీతం మనమే ఇచ్చాం. కానీ యూట్యూబ్ లలో ప్రభుత్వ ఉద్యోగులు మనకు దూరమయ్యే విధంగా ప్రచారం చేశారు. పదేళ్లలో కేసీఆర్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. దేశంలోనే ఇలా ఉద్యోగాలు ఇచ్చిన మొనగాడు ఉన్నాడా అంటే సమాధానం లేదు. కానీ రాహుల్ గాంధీ, మోడీ కుక్కలు మాత్రం ఇక్కడ తప్పుడు మొరుగుడు మొరిగాయ్. రేవంత్ రెడ్డి వచ్చినంక 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు. అని కేటీఆర్ విమర్శించారు.
‘‘ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. మంది పిల్లలను మా పిల్లలు అని చెప్పుకునే పరిస్థితి కాంగ్రెస్ ది. వాళ్లు ఇచ్చిన హామీలను గల్లా పట్టి అడిగేటోళ్లు ఉండాలె. రేవంత్ రెడ్డికి బాకా ఊదేవాళ్లు కాదు. రేవంత్ రెడ్డి మహిళలకు రూ. 2500, పెద్దమనుషులకు రూ. 4 వేలు అన్నాడు. ఎవరికైనా వచ్చాయా? సిగ్గు లేకుండా రాహుల్, ప్రియాంక గాంధీలు మహిళలకు రూ. 2500 ఇస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడ నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి, ఇక్కడి జిల్లా మంత్రి రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతా అన్నారు’’ అని కేటీఆర్ గుర్తు చేశారు.