3 Lakh Dog Bites : పదేళ్లలో 3,36,767 మందిని కరిచిన కుక్కలు.. సంచలన నివేదిక
కుక్కకాటు ఘటనలు తక్కువేనని చాలామంది భావిస్తుంటారు. వాటన్నింటిని లెక్కేస్తే లక్షల సంఖ్యలో ఉంటాయి.
- By Pasha Published Date - 10:21 AM, Wed - 10 July 24

3 Lakh Dog Bites : కుక్కకాటు ఘటనలు తక్కువేనని చాలామంది భావిస్తుంటారు. వాటన్నింటిని లెక్కేస్తే లక్షల సంఖ్యలో ఉంటాయి. అంటే బాధితుల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంటుందన్న మాట. ఒక్కో బాధితుడికి కనీసం ముగ్గురు, నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారు. ఆ బాధిత వ్యక్తి కుక్క కాటుకు గురైనప్పుడు కుటుంబంలోని వారంతా చాలా ఆందోళనకు లోనవుతారు. మానసిక క్షోభను అనుభవిస్తారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కుక్కకాట్లకు సంబంధించిన ఓ సంచలన నివేదికను విడుదల చేసింది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
గత పదేళ్లలో..
- గత పదేళ్లలో జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలో వీధికుక్కల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. అవి దాడి చేసే ఘటనలు బాగా పెరిగాయి.
- హైదరాబాద్ నగరంలో దాదాపు 6 లక్షల కుక్కలు ఉన్నాయి. ఏడేళ్ల క్రితం కూడా నగరంలో 5.8 లక్షల కుక్కలు ఉండేది. అంటే వాటి సంఖ్య తగ్గలేదు.
- గత పదేళ్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 3,36,767 మందిని(3 Lakh Dog Bites) కుక్కలు కరిచాయి. ఈ వివరాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) తమకు అందించిందని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.
- గత పదేళ్లలో కుక్కకాటుకు గురై 8 మంది చనిపోయారని ఐపీఎం అంటోంది. బయటి ఆస్పత్రుల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే చనిపోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. కుక్కకాటు ఘటనల సంఖ్య కూడా ఇంకా ఎక్కువే ఉంటుంది.
- కుక్కల వల్ల ఇబ్బంది అవుతోందని ప్రజల నుంచి గత పదేళ్లలో జీహెచ్‌ఎంసీకి 3,60,469 ఫిర్యాదులు వచ్చాయి.
- వీధి కుక్కల నియంత్రణకు గ్రేటర్ హైదరాబాద్ (బల్దియా) పశు వైద్య విభాగం ఏటా రూ.10 కోట్లు ఖర్చు చేస్తోంది. గత రెండేళ్లలో ఏటా రూ.11.5 కోట్లను వీధికుక్కల నియంత్రణకు ఖర్చు చేశారు.
- హైదరాబాద్ పరిధిలో మొత్తం ఐదు జంతు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ప్రతిరోజూ దాదాపు 400 కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఏబీసీ శస్త్రచికిత్సలు చేస్తున్నారు.
- కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఇన్ని సర్జరీలు చేస్తున్నా.. వాటి సంఖ్య ఎందుకు తగ్గడం లేదు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. జీహెచ్‌ఎంసీ చెబుతున్న లెక్కలపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
Also Read :Bypolls Today : 13 అసెంబ్లీ స్థానాల్లో బైపోల్స్.. 7 రాష్ట్రాల్లో పోలింగ్ షురూ
- కుక్కలు సంవత్సరానికి రెండుసార్లు గర్భం దాల్చుతాయి. ఆ రెండు సీజన్లు పూర్తయ్యేలోగా అన్నింటికీ ఏబీసీ శస్త్రచికిత్సలు జరగాలి. అయితే ఆ రేంజులో కుక్కలకు సర్జరీలు చేసే వనరులు జీహెచ్ఎంసీ వద్ద లేవు. సర్జరీలు చేసేందుకు 22 మంది వైద్యులే ఉన్నారు.
- వీధి కుక్కలను పట్టుకునేందుకు 50 వాహనాలు, 362 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు.