Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు..జూన్ 30న బాధ్యతల స్వీకరణ
- Author : Vamsi Chowdary Korata
Date : 24-06-2026 - 9:47 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం రిలీవ్ చేసింది. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ కాలం జూన్ 30తో ముగియనుండటంతో అదే రోజున సంజయ్ జాజు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని అధికారిక వర్గాల సమాచారం.
జాజు కెరీర్ ట్రాక్ రికార్డ్ ఇదే!
1992 బ్యాచ్, తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు, దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. తెలంగాణ కేడర్ అధికారులలో ఇంత ఎక్కువ కాలం కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన వారిలో ఆయన ఒకరు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (DoNER) కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రస్తుత సీఎస్ పదవీ విరమణకు సరిగ్గా వారం రోజుల ముందు ఆయనను సొంత కేడర్‌కు పంపుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (DoPT) నిన్న ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన నియామకం దాదాపు ఖాయమైంది. “తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సంజయ్ జాజును ఆయన సొంత కేడర్‌కు తిరిగి పంపేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని” ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా, నాటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సమర్థవంతంగా పనిచేశారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం కేంద్రంలో ఆయనకున్న విస్తృత అనుభవం, పరిచయాలేనని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు సాధించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖలతో బలమైన సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్, ప్రతిపాదిత బుల్లెట్ రైలు కారిడార్లు, రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, ఆర్థిక సహకారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో సంజయ్ జాజుకున్న అనుభవం, అక్కడి పనివిధానంపై ఉన్న అవగాహన తెలంగాణకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విశ్వసిస్తున్నట్లు సమాచారం.
సీఎస్ పదవి కోసం సీనియర్ అధికారులు జయేష్ రంజన్, వికాస్ రాజ్ వంటి వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, సుదీర్ఘ సర్వీస్ (2028 మార్చి వరకు), కేంద్రంలో ఉన్న నెట్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చివరికి సంజయ్ జాజును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక, ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. వాస్తవానికి 2025 ఆగస్టులోనే పదవీ విరమణ చేయాల్సి ఉన్నా, ఆయనకు రెండు విడతల్లో మొత్తం 10 నెలల పాటు ప్రభుత్వం పదవీ కాలాన్ని పొడిగించిన విషయం తెలిసిందే.