KCR: సమ్మక్క సారలమ్మ తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి: కేసీఆర్
- By Balu J Published Date - 05:26 PM, Thu - 22 February 24

KCR: తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలిముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవిబిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళా గా ప్రసిద్ధిగాంచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొనసాగిన ఆత్మగౌరవ పోరాటంలో, సమ్మక్క సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ పేర్కొన్నారు.
ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా నాటి సమైక్యపాలకుల ఏలుబడిలో అలజడులకు గురైన గోదావరీలోయ పరీవాహక ప్రాంతం నేడు సాగునీటి జీవజలం తో సస్యశ్యామలమై ప్రజల జీవితాల్లో సాంత్వన నింపిందని అన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దేశవ్యాప్తంగా తల్లుల దర్శనార్థం కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత సూచించారు.తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను కేసీఆర్ ప్రార్థించారు.
Also Read: Shami Ruled Out: ఐపీఎల్‌కు మహమ్మద్ షమీ దూరం..!