Sajjanar Warning : వచ్చి రావడంతోనే వీఐపీలకు వార్నింగ్ ఇచ్చిన సజ్జనార్
Sajjanar Warning : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో సజ్జనార్ దీనిపై సమగ్ర ప్రణాళికలు చేపడతామని తెలిపారు. ప్రతి ఏడాది లక్షల్లో కొత్త వాహనాలు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ భారమవుతోందని, ఇది ప్రజల సమయాన్ని వృథా చేయడమే
- Author : Sudheer
Date : 30-09-2025 - 9:16 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్(Hyderabad’s New Police Commissioner)గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (Sajjanar ) నగరంలో భద్రత, నేర నియంత్రణకు సంబంధించి స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఆయన ముఖ్యంగా నగరాన్ని వేధిస్తున్న డ్రగ్స్ సమస్యపై ఉక్కుపాదం మోపుతామని ఉద్ఘాటించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలను అరికట్టేందుకు ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే మరిన్ని సిబ్బందిని కేటాయించి డ్రగ్స్ ముఠాలపై దాడులు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజల అవగాహన పెంచడం, ముఖ్యంగా వృద్ధులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడే కేటుగాళ్లపై ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
Chennai: చెన్నైలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
సజ్జనార్ తన మీడియా సమావేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. యువతను నాశనం చేస్తున్న ఈ యాప్‌లకు దూరంగా ఉండాలని, వాటి ప్రమోషన్లలో పాల్గొనే వీఐపీలు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, అరుదైన వ్యాధుల మందుల పేరుతో జరిగే మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కల్తీ ఆహారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించి, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మార్కెట్‌లో నిఘా వ్యవస్థను బలోపేతం చేసి కల్తీ నేరగాళ్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో సజ్జనార్ దీనిపై సమగ్ర ప్రణాళికలు చేపడతామని తెలిపారు. ప్రతి ఏడాది లక్షల్లో కొత్త వాహనాలు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ భారమవుతోందని, ఇది ప్రజల సమయాన్ని వృథా చేయడమే కాక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని రోడ్ టెర్రరిస్టులుగా భావించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఈ ప్రకటనలతో సజ్జనార్ నగర వాసుల్లో కొత్త ఆశలు రేకెత్తించారు.